Studio18 News - తెలంగాణ / : Gossip Garage : బీజేపీ ఆపరేషన్ -2028 స్టార్ట్ చేసిందా? సామాజిక సమీకరణలతో ఎన్నికల యుద్ధం చేయాలని నిర్ణయించిందా? రాష్ట్రంలోని రెండు ప్రధాన సామాజికవర్గాల నేతలను పార్టీలో చేర్చుకుని మిషన్-2028ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోందా? ఆల్టర్నేట్ సర్కార్ అంటూ గత ఎన్నికల ముందు ఎంతో హడావుడి చేసిన బీజేపీ… ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం వదులుకోకూడదనే ఉద్దేశంతో నాలుగున్నరేళ్ల ముందు నుంచే పక్కా ప్లాన్ వేస్తోందంటున్నారు.. 2028 ఎన్నికల్లో విజయం సాధించడమే టార్గెట్‌గా పావులు.. నాలుగున్నరేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావడమే టార్గెట్‌గా బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఎదిగి… 2028 ఎన్నికల్లో విజయం సాధించడమే టార్గెట్‌గా పావులు దుపుతున్నారు కలమం పార్టీ అగ్రనేతలు. పక్కాప్లాన్ ప్రకారం పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నారు. సామాజిక సమీకరణలతో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న కమలనాథులు… తెరచాటుగా మంత్రాంగం నడుపుతూ ప్రత్యర్థులను దెబ్బతీయాలని వ్యూహం రచిస్తున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల గెలిచిన బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలను గెలుచుకుని 56 చోట్ల ప్రభావం చూపింది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రెండు రెట్ల బలం పుంజుకుని అసెంబ్లీపై బీజేపీ జెండా ఎగరేయాలని భావిస్తోంది. ఇందుకోసం బీసీలు, ఎస్సీలకు దగ్గరవ్వాలని పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో ఆయా వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించిన బీజేపీ… లోక్‌సభ ఎన్నికల నాటికి ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన విధానం తీసుకుని ఎంఆర్‌పీఎస్ మద్దతు పొందింది. దీంతో మెజార్టీ నియోజకవర్గాల్లో బీజేపీకి మేలు జరిగిందని విశ్లేషణలు ఉన్నాయి. మందకృష్ణ బీజేపీలో చేరతారా? ఈ పరిస్థితుల్లో ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణను బీజేపీలో చేర్చుకోవాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్న మంద కృష్ణమాదిగ బీజేపీలోకి వస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. తాను రాజకీయ పార్టీలకు దూరమని మంద కృష్ణమాదిగ చెబుతున్నా, ఆయనను ఎలాగైనా ఒప్పించాలనేది కమలనాథుల ఆలోచనగా కనిపిస్తోందంటున్నారు. ఇక ఇదే సమయంలో బీసీ నేత ఆర్.కృష్ణయ్యపైనా బీజేపీ ఫోకస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్.కృష్ణయ్యను తెలంగాణ బీజేపీ అక్కున చేర్చుకునేలా పావులు.. ప్రస్తుతం ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఆర్.కృష్ణయ్య… ఆ పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి 11 మంది ఎంపీలు ఉండగా, ఇప్పటికే ఇద్దరు రాజీనామా చేశారు. ఇక మిగిలిన వారిలో ఎక్కువ మంది బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో ఆర్.కృష్ణయ్యను తెలంగాణ బీజేపీ అక్కున చేర్చుకునేలా పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. బీసీ సంఘాల నేతగా కృష్ణయ్యకు తెలంగాణలో గుర్తింపు ఉంది. గతంలో ఎల్‌బీ నగర్ శాసనసభ్యుడిగానూ ఆయన పనిచేశారు. ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకున్న బీజేపీ.. బీసీ వర్గాల నేతను ఆకర్షించడం ద్వారా… వచ్చే ఎన్నికల నాటికి బీసీ ఓటర్లను పోలరైజ్ చేసేలా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. వైసీపీ ఎంపీలతోపాటు కృష్ణయ్య బీజేపీలో చేరతారా? లేక సెపరేట్‌గా తెలంగాణ బీజేపీతో కలిసి అడుగులేస్తారా? అన్నది చూడాల్సి వుందంటున్నారు. వైసీపీ ఎంపీల పార్టీ ఫిరాయింపులపై ఒకరిద్దరు ఖండించినా, ఆర్.కృష్ణయ్య మాత్రం ఇప్పటివరకు తన స్పందన తెలియజేయలేదు. ఈ పరిస్థితుల్లో ఆర్.కృష్ణయ్య రాజకీయ అడుగులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారిద్దరి ద్వారా మిషన్ 2028 కంప్లీట్ చేయాలని బీజేపీ వ్యూహం.. మొత్తానికి ఎంఆర్‌పీఎస్ నేత కృష్ణ మాదిగ, బీసీ నేత ఆర్.కృష్ణయ్య ద్వారా మిషన్ 2028 కంప్లీట్ చేయాలనే బీజేపీ వ్యూహమే పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ.. అదే సమయంలో ఎస్సీల్లో మాదిగల ఓట్లు అధికం.. దీంతో ఈ రెండు వర్గాలు తమతో కలిసి నడిస్తే అధికారం కైవసం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కానదేది కమలనాథుల వ్యూహం. అనుకున్న విధంగా అంతా పక్కాగా జరుగుతుందా? లేదా? అనేదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం… ఇప్పటికే తన రాజకీయ ప్రవేశంపై మంద కృష్ణమాదిగ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఆర్.కృష్ణయ్య స్పందన ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
Admin
Studio18 News