Studio18 News - తెలంగాణ / : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా, దక్షిణకొరియా దేశాల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్ కు చేరుకున్నారు. తాజాగా ఆయన మరో పర్యటనకు వెళ్తున్నారు. ఈ రాత్రి ఆయన ఢిల్లీకి పయనమవుతున్నారు. హస్తినలో రేపు ఆయన ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం పార్టీ హైకమాండ్ తో సమావేశమవుతారు. టీపీసీసీ నూతన చీఫ్ ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణపై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలతో చర్చిస్తారు. దీంతోపాటు వరంగల్ లో జరగనున్న రైతు కృతజ్ఞత సభకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. మంత్రివర్గ విస్తరణ విషయానికి వస్తే.... కేబినెట్ లో కొందరి శాఖలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఈసారి మైనార్టీలకు స్థానం కల్పించవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో స్థానంపై పలువురు సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. తమకు అనుకూలంగా ఉన్న మార్గాల ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
Admin
Studio18 News