Studio18 News - తెలంగాణ / : అక్రమ నిర్మాణాల కూల్చివేత మంచి నిర్ణయమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గతంలో బీఆర్ఎస్ మాదిరి కాకుండా ఆక్రమణలు మొత్తం కూల్చివేయాలని సూచించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులను కూడా శిక్షించాలన్నారు. హైడ్రా విషయమై తమ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. భూమాత పోర్టల్‌పై రైతుల్లో చర్చ పెట్టాలన్నారు. రుణమాఫీని పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రూ.2 లక్షల వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తే రూ.31,000 కోట్లు ఖర్చవుతుందన్నారు. కానీ రూ.18,000 కోట్లు మాత్రమే మాఫీ చేసి మొత్తం రుణమాఫీ అయ్యిందంటే ఎలా? అని ప్రశ్నించారు. రుణమాఫీకి రేషన్ కార్డు అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం అడుగుతున్నారని విమర్శించారు. ఎక్కడైనా సీఎం పర్యటనలు ఉంటే సీపీఎం నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోనూ ఇలాగే జరిగిందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న రెవెన్యూ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ అవలంబించిన విధానాలనే కాంగ్రెస్ కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రెండు గ్రామాల్లో రుణమాఫీపై స్టడీ చేశామని, 1100 మందిలో కేవలం 300 మందికి మాత్రమే మాఫీ అయిందన్నారు. అధికార కాంగ్రెస్... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వదిలేసి, బీఆర్ఎస్ వెంట పడటం విడ్డూరమన్నారు. అలా చేస్తే కాంగ్రెస్ పార్టీకే నష్టమన్నారు.
Admin
Studio18 News