Studio18 News - తెలంగాణ / : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గురుకులాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ క్యాంపులోని గురుకుల పాఠశాలలోఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై అనిరుధ్ అనే విద్యార్థి మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో అనిరుధ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్.. వారికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత ఎనిమిది నెలల్లో గురుకులాల్లో 36 మంది మృత్యువాత పడ్డారని చెప్పారు. గురుకుల పాఠశాలలో ఆలనా పాలనా చూసుకునే వారు కరవయ్యారని చెప్పారు. రాజకీయాలు అవసరంలేదని, బాధిత 36 కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కేటీఆర్ అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వవానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. సుమారు 500 మంది ఆసుపత్రుల పాలయ్యారని, ప్రభుత్వం ఇకనైనా మేల్కోవాలని కేటీఆర్ చెప్పారు. అన్ని పాఠశాలల ఆవరణలు వెంటనే శుభ్రపరచాలని, ప్రభుత్వమే తల్లిదండ్రిలాగా విద్యార్థుల బాగోగుల బాధ్యతలను తీసుకోవాలని అన్నారు. కాగా, అనిరుధ్ పాముకాటుకు గురై మృతి చెందినట్లు తెలుస్తోంది.
Admin
Studio18 News