Studio18 News - తెలంగాణ / : N Convention Demolished : హీరో అక్కినేని నాగార్జునకు హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేసింది. మాదాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య తెల్లవారుజాము నుంచి కూల్చివేతను అధికారులు చేపట్టారు. తుమ్మిడి చెరువును ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. దాదాపు మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని గతంలోనే అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. అయితే, ఇటీవల స్వయంగా ఓ మంత్రి ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై మంత్రి కోటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రాకు ఈనెల 21న లేఖ రాశారు. గూగుల్ మ్యాప్, ఎఫ్టీఎల్ ఆధారంగా ఎన్ కన్వెన్షన్ చెరువును ఆక్రమించుకొని నిర్మాణం చేసినట్లు మంత్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి ఫిర్యాదు మేరకు హైడ్రా బృందం రంగంలోకిదిగి విచారణ చేపట్టింది. మంత్రి ఫిర్యాదు మేరకు అన్ని శాఖల అధికారుల నుంచి నివేదిలకు తెప్పించుకుంది. హైడ్రా విచారణలో చెరువును ఆక్రమించుకొని నిర్మాణం జరిగిందని తేల్చింది. దీంతో శనివారం తెల్లవారు జామున కూల్చివేతలను హైడ్రా బృందం ప్రారంభించింది. మరోవైపు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. వ్యవస్థలు తమ పనితాము చేస్తాయని అన్నారు. గత ప్రభుత్వాల తప్పిదాలను భవిష్యత్ తరాలకు ఇవ్వకుండా సరిచేస్తున్నామని జూపల్లి కృష్ణారావు అన్నారు.
Admin
Studio18 News