Studio18 News - తెలంగాణ / : ఫ్లోర్‌కు లిఫ్ట్ రాకున్నా తలుపులు తెరుచుకోవడంతో ఓ వృద్ధుడు నాలుగో అంతస్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ శివారులోని గుడిమాల్కాపూర్‌లో జరిగిందీ ఘటన. రిటైర్డ్ ఫార్మసిస్ట్ అయిన 65 ఏళ్ల ఎంఎస్ సమియుల్లా బేగ్ స్థానిక ప్రియా కాలనీలో ఉంటున్నారు. బేగ్ ఈ నెల 17న కేటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. నిన్న కుటుంబ సభ్యులందరూ బయటకు వెళ్లగా ఇంట్లో భార్యాభర్తలిద్దరే ఉన్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో బేగ్ తాముండే నాలుగో ఫ్లోర్ నుంచి కిందికి వెళ్లాలని అనుకున్నారు. లిఫ్ట్ వద్దకు వెళ్లి బటన్ నొక్కారు. అయితే, లిఫ్ట్ ఫ్లోర్‌కు చేరుకోనప్పటికీ తలుపులు తెరుచుకున్నాయి. ఈ విషయం తెలియని బేగ్ అందులో కాలుపెట్టే సరికి అమాంతం కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్దారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అపార్ట్‌మెంట్లలోని లిఫ్ట్‌ల పనితీరుపై ఆందోళనలు రేకెత్తిస్తోంది.
Admin
Studio18 News