Studio18 News - తెలంగాణ / : తెలంగాణ అసెంబ్లీలో ఆర్టీసీ కార్మికుల అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఆర్టీసీ కార్మికులను పీఆర్సీ పరిధిలోకి తెస్తామని చెప్పారని, దీనిని అమలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆర్టీసీ విలీనంపై ఎప్పటిలోగా ఆపాయింటుమెంట్ డేట్ ప్రకటిస్తారో చెప్పాలన్నారు. అలాగే కార్మికుల యూనియన్ పునరుద్ధరణ ఎప్పుడు చేస్తారో స్పష్టం చేయాలన్నారు. ఆర్టీసీకి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆర్టీసీ అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. యూనియన్లను రద్దు చేసి, ఇప్పుడు పునరుద్ధరణ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసినా గతంలో పట్టించుకోలేదని ఆరోపించారు. ఆర్టీసీ సొమ్మును కూడా ప్రభుత్వం వాడుకుందన్నారు. కానీ తాము మాత్రం ఆర్టీసీకి రూ.300 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. కొత్త బస్సులను కూడా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీలో 3,035 మంది ఉద్యోగులను నియమిస్తున్నామన్నారు. పని భారం పెరిగినా ఆర్టీసీ కార్మికులు బాగా పని చేస్తున్నారని కితాబునిచ్చారు.
Admin
Studio18 News