Studio18 News - తెలంగాణ / : CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన పదేళ్లలో తెలంగాణ తల్లి నిర్లక్ష్యానికి గురైంది. పదేళ్లలో ఒక్క చోటైనా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియెట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు బుధవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వెంకటరెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు భూమిపూజ కార్యక్రమాన్ని పెద్దెత్తున చేయాలని భావించాం. కానీ, మరికొన్ని రోజుల వరకు మంచి ముహూర్తాలు లేవని పండితులు సూచించారు. ముహూర్తం ప్రకారం వేదపండితులతో ఈరోజు భూమి పూజ చేస్తున్నామని అన్నారు. సోనియాగాంధీతోనే తెలంగాణ కల సాకారమైంది. గత ప్రభుత్వం తెలంగాణ తల్లిని మరుగున పడేసింది. అంతా తానే అన్నట్లు గత పాలకులు వ్యవహరించారు. ప్రగతి భవన్ గడీలతో బంధిస్తే.. మేము ప్రజా భవన్ చేశాం. పాలనకు గుండెకాయ సచివాలయం. అందుకే ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. గతంలో సెక్రటేరియట్ నిషేధిత ప్రాంతంగా ఉండేది. కనీసం విగ్రహం పెట్టలేదని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకులపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి ముడిపెడుతున్నారు.. పదేళ్లలో ఒక్క చోటైనా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారా? అంటూ బీఆర్ఎస్ నేతలను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మన కన్న తల్లిని చూసినట్టు తెలంగాణ తల్లి ఉంటుంది. సోనియా పుట్టినరోజు నాడు, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ రోజు డిసెంబర్ 9న ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తాం. డిసెంబర్ 9న తెలంగాణకు పండుగ రోజు. డిసెంబర్ 9న మిలియన్ మార్చ్ మాదిరి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఎంతో సంతోషం. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఎంతో గొప్పగా ఉంది. మా ప్రభుత్వం ప్రజలకోసమే ప్రయాణం చేస్తున్నాం. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం జరిగిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకులపై మంత్రి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Admin
Studio18 News