Studio18 News - TELANGANA / : Gossip Garage : సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. ఆయన హైదరాబాద్‌లో అడుగుపెట్టగానే కాంగ్రెస్ రాజకీయం వేడెక్కుతోంది. పీసీసీతోపాటు మంత్రివర్గంలో చోటు కోసం ఆశలు పెట్టుకున్న నేతలు….. నామినేటెడ్ పదవులపై కర్చీఫ్ వేసి వెయిటింగ్‌లో ఉన్న నాయకులు సీఎం రేవంత్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 15న జెండా పండగ ముగిసిన వెంటనే ఢిల్లీ వెళ్లనున్న సీఎం…. పెండింగ్‌లో ఉన్న పదవుల భర్తీ చేసే అవకాశం ఉందనే ప్రచారమే కాంగ్రెస్‌లో హైఅలర్ట్ ప్రకటించింది. పదవుల కోసం ప్రదక్షిణలు.. తెలంగాణ పీసీసీ సారథితోపాటు మంత్రివర్గం విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. స్వతంత్ర దినోత్సవ సంబరాలు ముగిసిన వెంటనే సీఎం ఢిల్లీ టూర్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ పర్యటనలోనే పీసీసీ చీఫ్ నియామకంతోపాటు మంత్రివర్గ విస్తరణ, ఆపరేషన్ ఆకర్ష్ 2.O, నామినేటెడ్ పోస్టుల భర్తీపై హైకమాండ్‌తో చర్చించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఆశావాహుల్లో కోలాహలం మొదలైంది. ఇప్పటికే మంత్రి పదవులపై కన్నేసిన పలువురు నేతలు సీఎం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా, పీసీసీ చీఫ్ పదవి కోసం ఒకరిద్దరు నేతలు పైరవీలు చేస్తున్నారు. పీసీసీ బాధ్యతలు వేరే వాళ్లకు అప్పగించాలని సీఎం నిర్ణయం.. ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్‌రెడ్డే కొనసాగుతున్నారు. డిసెంబర్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే పీసీసీ చీఫ్‌గా వేరొకరిని నియమించాలని భావించారు రేవంత్‌రెడ్డి. ఐతే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రేవంత్‌రెడ్డినే కొనసాగాలని కోరింది హైకమాండ్. ఇప్పుడు ఎన్నికలు ముగియడం, రాజకీయంగా పెద్దగా హడావుడి లేకపోవడంతో పూర్తిగా పాలనా వ్యవహారాలపై ఫోకస్ చేయాలని భావిస్తున్న సీఎం…. పీసీసీ బాధ్యతలను వేరొకరికి అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ముగ్గురిలో ఒకరికి పీసీసీ బాధ్యతలు.. ఐతే ఈ పదవి కోసం కాంగ్రెస్‌లో చాలా మంది సీనియర్లు తీవ్రంగా పోటీపడుతున్నారు. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు మాజీ ఎంపీ మధుయాష్కీ బీసీ కోటాలో పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారు. అయితే పార్టీ హైకమాండ్ మాత్రం ఎస్‌టీలకు అవకాశం ఇవ్వాలని ప్రతిపాదిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఎస్‌టీలనే పీసీసీ అధ్యక్షుడిని చేయాలంటే మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ పేర్లు పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. బాలూనాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. కానీ, ఆయనను డిప్యూటీ స్పీకర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మహేశ్‌కుమార్ గౌడ్, మధు యాష్కీ లేదంటే బలరాం నాయక్ ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు పీసీసీ సారథి అయ్యే అవకాశం ఉందంటున్నారు. మంత్రి వర్గ విస్తరణను పట్టాలెక్కించాలని సీఎం కసరత్తు.. పీసీసీ సారథితోపాటు పెండింగ్‌లో ఉన్న మంత్రి వర్గ విస్తరణను పట్టాలెక్కించాలని సీఎం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. మంత్రివర్గంలో ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయి. కానీ, ప్రస్తుతానికి 4 ఖాళీలను భర్తీ చేయాలని సీఎం భావిస్తున్నారట… అవసరం బట్టి మిగిలిన రెండు ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో 11 మంది మంత్రులు ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం నుంచి ముగ్గురు, ఉమ్మడి నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మంత్రులు ఉన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు అసలు ప్రాతినిధ్యం లేదు. దీంతో తాజా మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాల నుంచి మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అదేవిధంగా సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్ నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకాటి శ్రీహరికి బెర్త్ కన్ఫార్మ్ అయిందని టాక్ వినిపిస్తోంది. మిగిలిన 2 మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయో? ముదిరాజ్‌లను మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఎన్నికల సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. అదే విధంగా పార్టీలోకి వచ్చే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిని ఆఫర్ చేశారు. దీంతో వాకాటి శ్రీహరి, రాజగోపాల్‌రెడ్డికి లైన్‌క్లియర్ అయినట్లేనని ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలిన రెండు మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనే ఉత్కంఠ ఎక్కువవుతోంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్‌సాగర్‌రావుతోపాటు గెడ్డం వివేక్ బ్రదర్స్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. వెలమ సామాజికవర్గానికి చెందిన ప్రేమ్‌సాగర్‌రావుకు పదవిపై తర్జనభర్జన సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెలమ సామాజికవర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండగా, ఇంకొకరిని తీసుకోవడం సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. గడ్డం బ్రదర్స్‌కు అవకాశాలు తక్కువ..! ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి అండదండలతో ప్రేమ్‌సాగర్‌రావు తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక గెడ్డం బ్రదర్స్ మంత్రి పదవిని ఆశిస్తున్నా…. వారి కుటుంబానికి ఎంపీ టికెట్ ఇవ్వడం, ఎస్‌సీ సామాజికవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తుండటం వల్ల గడ్డం బ్రదర్స్‌కు అవకాశాలు తక్కువే అన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత పి.సుదర్శన్‌రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. కాంగ్రెస్ లోకి వస్తే పదవులు..1 మంత్రివర్గ విస్తరణలో నాలుగు ఖాళీలను భర్తీ చేసి, రెండింటిని పెండింగ్ పెట్టడం వెనుక ఆపరేషన్ ఆకర్ష్ 2.O కారణమనే టాక్ వినిపిస్తోంది. బీఆర్‌ఎస్ నుంచి మరింత మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోడానికి వారికి పదవులు ఎరగా చూపించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్‌లోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని కొందరికి ఆఫర్ ఇవ్వడంతోపాటు మరికొందరికి క్యాబినెట్ హోదాలో నామినేటెడ్ పదవులు ఇస్తామని సీఎం ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా, వీరిలో ఎవరికీ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఆగస్టు 15 తర్వాత కాంగ్రెస్‌లో పదవుల పందేరం.. ఇక కొత్తగా చేరే వారికి ఈ తరహా ఆఫర్ చేసి…. బీఆర్‌ఎస్ఎల్పీ విలీనం దిశగా అడుగులు వేయాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. సీఎం విదేశీ పర్యటన ముగించుకు వచ్చిన వెంటనే పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోవాలంటే… పార్టీ బాధ్యతల నుంచి తాను తప్పుకోవాలనేది సీఎం ఆలోచనగా చెబుతున్నారు. మొత్తానికి తిరంగా పండగ తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల పందేరానికి తెరలేవడం ఖాయమని అంతా చెబుతున్నారు.
Admin
Studio18 News