Studio18 News - తెలంగాణ / : School Holiday : జీహెచ్ఎంసీ పరిధిలో మంగళవారం ఉదయం కుండపోత వర్షం కురిసింది. తెల్లవారు జామున 4గంటల నుంచి ఎడతెరిపిలేకుండా సుమారు మూడు గంటలపాటు వర్షం దంచికొట్టింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలతోపాటు నగర శివారులోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు బయటకురాలేని పరిస్థితి ఏర్పడింది. రంగారెడ్డి జిల్లాలోని జీహెచ్ఎంసీ ఏరియాలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇవాళ మొత్తం ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ ఏరియాల్లో కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రభుత్వ పాఠశాలల ఆవరణాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. వర్షం కారణంగా రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లాలో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నిరంతర వర్షాలు, వాతావరణ శాఖ సూచనల కారణంగా రంగారెడ్డి జిల్లాలోని GHMC ప్రాంతంలోని అన్ని పాఠశాలలు మంగళవారం మూసివేయబడతాయని జిల్లా డీఈఓ తెలిపారు. జిల్లాలోని మిగిలిన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రధానోపాధ్యాయులు తమ భవనాల పరిస్థితిని, పాఠశాలలకు కనెక్టివిటీని అంచనావేసి అవసరమైతే సెలవు ప్రకటించాలని, ఈ విషయాన్ని ఎంఈవోలకు తెలియజేయాలని డీఈవో సూచించారు.
Admin
Studio18 News