Studio18 News - తెలంగాణ / : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. కవితకు బెయిల్ వస్తుందన్న విషయం ఊహించిందేనని చెప్పారు. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ప్రారంభమవుతుందని, అదొక్కటే ఇప్పుడు మిగిలిందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు కావడంతోనే ఆమెకు బెయిల్ వచ్చిందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్‌ను బీఆర్ఎస్, బీజేపీ దెబ్బతీయాలని చూశాయని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని చెప్పారు. హరీశ్ రావు, కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ తిరిగి వేడుకున్నారని అన్నారు. బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ల మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని, బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని అన్నారు. మరోవైపు, కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.
Admin
Studio18 News