Studio18 News - తెలంగాణ / : puvvada ajay kumar: ఖమ్మంలో తమపై దాడి చేసింది కాంగ్రెస్ వాళ్లేనని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లో మంత్రుల పర్యవేక్షణలో తమపై దాడి జరిగిందన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బుధవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తమపై భౌతిక దాడులు చేయించిందని పువ్వాడ అజయ్ అన్నారు. భౌతికంగా మాపై దాడి చేస్తే ఖమ్మం ప్రజల భాదలు తీరుతాయా అని ప్రశ్నించారు. ”మున్నేరు వరద భాదితులను ఆదుకునేందుకు వెళ్తే మాపైన దాడి చేశారు. ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులకు వాయిస్ లేదు. ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారని ప్రజలు భావిస్తున్నారు. మున్నేరుకు వరద ఎక్కడి నుండి వస్తుందో రేవంత్ రెడ్డికి తెలుసా? సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మహబూబాబాద్ వెళ్లి నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు. అజయ్ కుమార్ ఆక్రమణల వలనే ఖమ్మం మునిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. మున్నేరు పరివాహకంలో రాజీవ్ గృహకల్ప, జలగం నగర్ కాలనీలు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మున్నేరుకు రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. ఆదివారం ఉదయం నాటికి 33 అడుగుల నీరు వచ్చింది. ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలం అయింది. ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు రేవంత్ రెడ్డి వ్యవహరించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా పని చేశామో ప్రజలకు తెలుసు. ఖమ్మం నగరంలో ఒక్క ఇంచు నేను ఆక్రమించినా కూల్చేయండి. నా హాస్పిటల్ కట్టి 25 సంవత్సరాలు అయింది. నా హాస్పిటల్‌కు చుక్క నీరు రాలేదు. నా హాస్పిటల్‌కు మున్నేరుకు సంబంధం లేదు. కేసీఆర్ వరద సహాయం చేస్తే నువ్వు సీఎం పదవిలో ఉండి ఎందుకు? ప్రజలను డైవర్ట్ చేసేందుకు నిన్న మాపై దాడులు చేశారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలను ప్రజలే కాపాడుకున్నారు. మున్నేరుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ కావాలని రూ. 650 కోట్లు మంజూరు చేయించాను. రిటైనింగ్ వాల్ ఎందుకు కట్టడం లేదో ప్రభుత్వం చెప్పాలి. మంత్రుల ఫంక్షన్ హాల్స్ ఆక్రమణలో ఉన్నాయని ఖమ్మం ప్రజలు అనుకుంటున్నారు. రెవెన్యూ మంత్రి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. మరో మంత్రి విల్లాలు వక్ఫ్ బోర్డు భూముల్లో ఉన్నాయి. ప్రజలు తమ ఇళ్లకు వెళ్లి 36 గంటలు అయింది. మున్నేరుకు శాశ్వత పరిష్కారం ప్రభుత్వం చూపాలి. హైడ్రాను మంత్రుల ఫంక్షన్ హాళ్లు, విల్లాలతో మొదలు పెట్టండి. మాపై దాడి చేసిన వారి పేర్లతో సహా సీపీకి ఫిర్యాదు చేశాం. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు మనుషులే మాపై దాడి చేశార”ని పువ్వాడ అజయ్ అన్నారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లోనే దాడి: బాల్క సుమన్ ”ఖమ్మంలో నిన్న జరిగిన దాడి సీఎం రేవంత్ రెడ్డి దర్శకత్వంలో జరిగింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి ఈ ఘటన నిర్మాత. మమ్మల్ని చంపినా చివరి రక్తపు బొట్టు వరకు తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తాం. ఇప్పటి వరకు డీజీపీ ఈ ఘటనపై స్పందించలేదు. పోలీసులు అతిగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం. సీఎం రేవంత్ ఖమ్మంలో కబ్జాల గురించి మాట్లాడుతున్నారు. ముందు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. నాగార్జున సాగర్ కెనాల్‌ను ఆక్రమించి కట్టిన ఎస్ ఆర్ గార్డెన్స్ ను రేవంత్ రెడ్డి కూల్చాలి. పొంగులేటి ఆక్రమణలు నిజమేనని అధికారుల బృందం నిర్ధారించింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నేతల కబ్జా చిట్టా బయటపెడతాం. హైడ్రా పేరిట కొంత మందిని లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు చేస్తున్నారు. కొందరిని భయపెట్టేందుకే ఈ దాడులు చేస్తున్నార”ని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దుయ్యబట్టారు.
Admin
Studio18 News