Studio18 News - తెలంగాణ / : Hyderabad Metro Parking: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఉపశమనం లభించింది. నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్‌పై నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ వెనక్కు తగ్గింది. ప్రయాణికుల ఆందోళన నేపథ్యంలో పెయిడ్ పార్కింగ్ అమలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు ఎక్స్ ద్వారా వెల్లడించింది. నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద ఫ్రీ పార్కింగ్ సదుపాయం ఎత్తివేయాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ నాగోల్‌లో రేపు (ఆదివారం) మహాధర్నా చేసేందుకు ప్రయాణికులు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో మెట్రో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 25 నుంచి నాగోల్, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రోస్టేషన్లలో పార్కింగ్ ఫీజుకు వసూలు చేయనున్నట్టు ఎల్ అండ్ టీ ఇంతకుముందు ప్రకటించింది. పైలట్ ప్రాజెక్టుగా ఈనెల 14న నాగోల్ మెట్రో పార్కింగ్ ఏరియాలో ట్రయల్స్ కూడా నిర్వహించింది. దీంతో మెట్రో ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. ఫ్రీ పార్కింగ్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నాగోల్ మెట్రోస్టేషన్‌లో నిరసనకు దిగారు. ఎల్ అండ్ టీ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెట్రో ట్రైన్ టికెట్ కంటే పార్కింగ్ ఫీజే ఎక్కువ ఉందని ప్రయాణికులు వాపోయారు. పార్కింగ్ ఏరియాలో మెరుగైన వసతులు కల్పించడానికే ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినట్టు ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు అంతకుముందు చెప్పారు. 24 గంటల సీసీ కెమెరాల నిఘాతో పాటు బెటర్ లైటింగ్, బయో టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. వెహికిల్స్ అడ్డదిడ్డంగా పెట్టకుండా సౌకర్యవంతమైన పార్కింగ్ అందించాలన్న లక్ష్యంతో ఫీజు వసూలు చేయాలనుకున్నట్టు వివరించారు. అయితే ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని వాయిదా వేశారు. వాహనదారులు ఎప్పటిలాగానే నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో తమ వాహనాలను ఫ్రీగా పార్క్ చేసుకోవచ్చు.
Admin
Studio18 News