Studio18 News - తెలంగాణ / : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీసీలను గెలిపించేందుకు అవసరమైతే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకైనా తాను వస్తానని ఆయన అన్నారు. తెలంగాణలో బీసీ సర్కారు రాబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. బీసీల అండదండలతోనే తాను గెలిచానని, తాను ఓడిపోతానని హేళన చేసిన వారిని ఎన్నికల్లో గెలవనివ్వబోనని వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. మళ్లీ టీవీ ముందు కూర్చుంటానని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని తీన్మార్ మల్లన్న అన్నారు. రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటను అమలుచేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని, ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని ఆయన హెచ్చరించారు. బడ్జెట్‌లో బీసీలకు రూ.9 వేల కోట్లు మాత్రమే కేటాయించడంపై ప్రభుత్వాన్ని తాను నిర్భయంగా ప్రశ్నించానని ప్రస్తావించారు. బిచ్చగాళ్లలా కుల సంఘాలకు రూ.50 కోట్లు ఏ విధంగా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో బీపీ మండల్ జయంతి సందర్భంగా ఆదివారం నిర్వహించిన ‘బీసీల సమర శంఖారావం’లో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీపీ మండల్ చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్నతో పాటు బీపీ మండల్ మనవడు సూరజ్‌యాదవ్, శాసనమండలి ఉపాధ్యక్షుడు బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News