Studio18 News - తెలంగాణ / : Gossip Garage : బీఆర్‌ఎస్ బాస్ కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమవుతున్నారట. ఎన్నికల్లో ఓటమి అనంతరం… హామీల అమలుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని భావించిన గులాబీదళాధిపతి… ఆ హనీమూన్ పీరియడ్ ముగిసిందని… ఇక ప్రజల తరఫున ప్రభుత్వంతో యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ప్రధానమైన రైతురుణమాఫీ సరిగా జరగలేదని భావిస్తున్న బీఆర్ఎస్… అధినేత రైతు యాత్రకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాక్షేత్రంలో యాక్టివ్ అవ్వాలని డిసైడ్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువగా ఎర్రవెల్లి ఫాం హౌస్‌కే పరిమితమవుతున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్… ఇక ప్రజాక్షేత్రంలో యాక్టివ్ అవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. రైతు రుణమాఫీలో చాలా మంది అర్హులకు న్యాయం జరగలేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రైతుల తరఫున ప్రభుత్వంతో పోరాడేందుకు రైతు యాత్ర చేపట్టాలని గులాబీ దళపతి నిర్ణయించినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా రాజకీయ కార్యక్రమాలకు దూరమైన కేసీఆర్.. ఇటీవల తనను కలిసిన ఎమ్మెల్యేలతో రైతు యాత్ర కోసం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వినాయకచవితి తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలకు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీ హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9 నెలలు అవుతున్నా, చాలా హామీలను అమలు చేయలేదని విమర్శిస్తోంది బీఆర్‌ఎస్. హామీల అమలుకు ఆర్నెల్లు సమయం ఇవ్వాలని భావించిన గులాబీదళం… అనుకున్న సమయం కన్నా ప్రభుత్వానికి మూడు నెలలు ఎక్కువ గడువు ఇచ్చినట్లు చెబుతోంది. తొమ్మిది నెలలు అయినా చాలా హామీలను అమలు చేయలేదని, చేశామని చెబుతున్న రైతు రుణమాఫీ కూడా సక్రమంగా అందలేదని బీఆర్‌ఎస్ ఆరోపణ. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించిన బీఆర్‌ఎస్ అధినేత… వినాయకచవితి తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. తాను రంగంలోకి దిగడం ద్వారా వలసలకు బ్రేక్ వేయాలని భావన.. ఇన్నాళ్లు హామీలు అమలు చేయకపోవడమే కాకుండా, తమ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్న కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కొవడంపై దృష్టిపెట్టిన కేసీఆర్… తాను రంగంలోకి దిగడం ద్వారా వలసలకు బ్రేక్ వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా, మరికొందరు ఎమ్మెల్యేలు హస్తం కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగితే పరిస్థితులు మారే అవకాశం ఉన్నందున ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కొందరు ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనర్హత వేటు భయం.. కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అయితే పార్టీ పుంజుకునే అవకాశం ఉందని, అదే సమయంలో అనుకున్న సంఖ్యలో వలసలు లేకపోతే అనర్హత వేటు పడే ప్రమాదాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని కొందరు ఎమ్మెల్యేలు భయపడుతున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ కూడా తనను కలిసిన ఎమ్మెల్యేలతో వలస వెళ్లిన వారిపై అనర్హత వేటు వేయించడంతోపాటు కాంగ్రెస్ హామీలపై ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. జంపింగ్ ఎమ్మెల్యేలపై వేటు వేయడమే టార్గెట్‌గా పెట్టుకున్న బీఆర్ఎస్…. పార్టీ అధినేత రంగంలోకి దిగిన తర్వాత అనర్హత వేటు ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా పావులు కదుపుతోందంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి పునర్ వైభవం తెచ్చేందుకు కార్యాచరణ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువగా ఫాం హౌస్‌లో ఉంటున్న మాజీ సీఎం కేసీఆర్… తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకులకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందని తాజాగా అంచనాకు వచ్చిన కేసీఆర్… స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి పునర్ వైభవం తెచ్చేందుకు ఇప్పటి నుంచే తగిన కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రైతు రుణమాఫీపై అసంతృప్తి ఎక్కువగా ఉన్నట్లు బీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. Also Read : ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదలు.. హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన కేసీఆర్ రంగంలోకి దిగితే స్థానిక ఎన్నికల్లో అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్.. రకరకాల నిబంధనలు విధించడం వల్ల.. 30 వేల కోట్లకుపైగా అవుతుందని అంచనా వేసిన రైతు రుణమాఫీ కేవలం 17 వేల కోట్లతో సరిపెట్టిందని ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ విషయమై కృష్ణార్జునులు హరీశ్ రావు, కేటీఆర్ ఇప్పటికే ఫైట్ చేస్తున్నారు. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి, ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేయాలని భావిస్తోంది బీఆర్ఎస్. ఇందుకోసం నేరుగా అధినేత రంగంలోకి దిగితే స్థానిక ఎన్నికల్లో అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందని ఊహిస్తోంది. కేసీఆర్ కూడా తగిన సమయం వరకు వేచి చూద్దామని ఇన్నాళ్లు ఆగారని.. ఇప్పుడు సమయం ఆసన్నమైనందున సమర శంఖం పూరించాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. వినాయక చవితి తర్వాత ఎప్పుడైనా, రైతు యాత్రలు ప్రారంభించేలా ప్లాన్ చేయాలని పార్టీ యంత్రాంగాన్ని ఆదేశించినట్లు చెబుతున్నారు.
Admin
Studio18 News