Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్ సేఫ్‌గా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నిన్న కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రజా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర అభివృద్ధికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్ బోర్డు, మెట్రోలకు, హైడ్రాకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. వ్యూహాత్మకంగానే జంటనగరాల అభివృద్ధికి నిధులు ఇచ్చారని వెల్లడించారు. హైదరాబాద్‌లో వర్షాలు వస్తే కేసీఆర్ హయాంలో ఫామ్ హౌస్‌లో కూర్చొని మొసలి కన్నీరు పెట్టారని విమర్శించారు. పిట్ట కథలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట అని ధ్వజమెత్తారు. నిన్నటి బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉందన్నారు. కేసీఆర్ హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తా... మూసి నదిలో ఈతకొట్టేలా చేస్తానని ప్రగల్భాలు పలికారని విమర్శించారు. పాతబస్తీలో మౌలిక వసతులు లేవని విమర్శించారు. మెట్రో విస్తరణకు నిధులు ఇచ్చారన్నారు. గ్రామీణ ప్రాంతంతో పాటు భాగ్యనగరానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క బడ్జెట్ చదువుతుంటే కేసీఆర్ బయటకు వచ్చి విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల భూములు అమ్మడం పైన... అప్పులు చేయడంపైనా ఫోకస్ చేశారని విమర్శించారు. ఎవరైనా భూములు అమ్మాలన్నా... అప్పులు చేయాలన్నా... ఆయన వద్ద నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు.
Admin
Studio18 News