Studio18 News - తెలంగాణ / : KTR: అన్నా చెల్లెళ్ళు ఆత్మీయంగా జరుపుకునే పండగ రక్షా బంధన్ పండుగ నాడు.. తన సోదరి కవిత తమతో లేకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత 150 రోజులుగా అనుభవిస్తున్న వేదనకు న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రతీ సోదరికి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కుసంస్కార పార్టీ అని, తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తమ మీద రుద్దడం సమంజసం కాదని అన్నారు. రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మెప్పుకోసం రాజీవ్ విగ్రహాన్ని గాంధీ భవన్ లోనో లేదంటే జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లో పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సలహాయిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని, అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్చి తెలంగాణ ప్రముఖుని పేరు పెడతామని కేటీఆర్ పేర్కొన్నారు. మంత్రి సీతక్కకు 8 నెలల తర్వాత అయినా మహిళలపై అఘాయిత్యాలు గుర్తుకు రావడం మంచి పరిణామం. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ప్రభుత్వం, మహిళా కమీషన్ స్పందించాలి. ఈ ప్రభుత్వం తీరు దున్నపోతు మీద వాన పడినట్లుగా ఉంది. చెంచు మహిళపై అఘాయిత్యం జరిగితే మా నాయకులు వెళ్లే వరకు పట్టించుకున్న వారు లేరు. షాద్ నగర్ లో ఒక దళిత మహిళపై అఘాయిత్యం జరిగితే మా నాయకులు వెళ్ళే వరకు పట్టించుకోలేదు. మేము గొడవ చేస్తే పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. మహిళలు, పిల్లలు, ప్రజలు శాంతియుతంగా బ్రతికే విధంగా మహిళా కమిషన్, ప్రభుత్వం చూసుకోవాలి. హైదరాబాద్ నగరంలో మర్డర్లు జరుగుతుంటే ఆపే తెలివి లేదు. అఘాయిత్యాలు పెరుగుతుంటే పట్టించుకునే నాధుడు లేడు. రాష్ట్రానికి హోంమంత్రి దిక్కు లేడు. నేను పొరపాటున నోరుజారి ఒక మాట అంటే క్షమాపణ చెప్పాను. ప్రపంచంలో ఇంతకంటే పెద్ద సమస్య లేనట్లు దాన్నే సమస్య చేస్తున్నారు. దానికి రాజకీయ రంగు పులుముతున్నారు. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఘాయిత్యాలపై విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Admin
Studio18 News