Studio18 News - తెలంగాణ / : Raksha Bandhan 2024 : రాఖీ పౌర్ణమి వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కడుతూ తమ ప్రేమను చాటుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చిన్నారులతో కలిసి రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. ఢిల్లీ పాఠశాల విద్యార్థులు సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. అనంతరం మోదీ వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. గతేడాది కూడా ప్రధాని ఇలాగే స్కూల్ విద్యార్థునులతో రాఖీ కట్టించుకున్న సంతగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బ్రహ్మకుమారీలు, టీడీపీ మహిళా నేతలు రాఖీలు కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలిశారు. చంద్రబాబుకు రాఖీ కట్టిన వారిలో టీడీపీ మహిళా నేతలు, మాజీ మంత్రి పీతల సుజాత, జడ్పీ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ డ్వాక్రా – అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అచంట సునీత, కంభంపాటి శిరీష సహా పలువురు బ్రహ్మకుమారీలు రాఖీ కట్టారు. సీఎం చంద్రబాబు వారికి ధన్యవాదాలు తెలిపి శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. స్వీటు తినిపించారు. అనంతరం పలువురు కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. రాష్ట్రంలోని మహిళలందరికీ సీఎం రేవంత్ రెడ్డి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్ లో జరిగిన రాఖీ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి కేటీఆర్ కు రాఖీలు కట్టారు.
Admin
Studio18 News