Studio18 News - TELANGANA / : Jitta Balakrishna Reddy Passes Away: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జిట్టా బాలకృష్ణారెడ్డి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. భువనగిరి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం లో జిట్టా బాలకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు. బాలకృష్ణారెడ్డి మృతివార్త తెలుసుకున్న రాజకీయ పార్టీల నేతలు, తెలంగాణ ఉద్యమ కారులు, పలు సంఘాల నాయకులు సంతాపం తెలియజేస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేసిన జిట్టా.. టీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత ఆ పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా భువనగిరి నియోజకవర్గం సీటును టీడీపీకి కేటాయించడంతో మనస్థాపంచెంది టీఆర్ఎస్ పార్టీని వీడారు. అదే ఎన్నికల్లో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ మరణానంతరం జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జిట్టా.. లోక్ సభలో ఆ పార్టీ తెలంగాణకు వ్యతిరేక విధానాన్ని తీసుకోవడంతో ఆ పార్టీని వీడారు. ఆ తరువాత యువ తెలంగాణ పార్టీ స్థాపించిన జిట్టా.. కొద్దికాలం తరువాత ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. 2023 అక్టోబర్ నెలలో తిరిగి జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. భువనగిరి శివారు మగ్గంపల్లి రోడ్డులోని ఆయన ఫామ్ హౌస్ లో సాయంత్రం 4గంటల సమయంలో జిట్టా బాలకృష్ణారెడ్డి పార్దీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిసింది.
Admin
Studio18 News