Studio18 News - తెలంగాణ / : సెల్‌ఫోన్ చార్జర్ కోసం గొడవ పడి ఓ మహిళ ప్రాణాన్ని తీశాడో వ్యక్తి. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండిగల్ పీఎస్ పరిధి తండా 2లో పాలు, కల్లు, మద్యం విక్రయిస్తూ బెల్ట్ షాపునూ నిర్వహిస్తోంది శాంత(50) అనే మహిళ. దుకాణం పక్కన ఆమె మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని శాంతను ఎవరో హత్య చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రావుల కమల్ కుమార్(37)ను నిందితుడిగా గుర్తించారు. నిందితుడు తాండ 2 గ్రామ సమీపంలోని ఆల్ట్రాక్లీన్ సర్వీసెస్ కంపెనీలో మెయింటెనెన్స్ సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతడిని గాగిల్లాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు శాంతతో మొబైల్ చార్జర్ కోసం గొడవపడ్డాడని, ఆమె దుర్భాషలాడడంతో నిందితుడు కొట్టి, ఆమెను తోసేయడంతో కిందపడి తలవెనక భాగంలో గాయమైంది. ఆమె కేకలు వేస్తుందన్న భయంతో కమల్ కుమార్.. ఆమె నోరు, ముక్కును మూశాడు. దీంతో ఊపిరి ఆడక ఆమె మరణించిందని నిందితుడు అన్నాడు.
Admin
Studio18 News