Studio18 News - తెలంగాణ / : MLA Bandla Krishna Mohan Reddy : తెలంగాణ రాజకీయాల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వ్యవహారంశైలి ఆసక్తికరంగా మారింది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాలుగు రోజులకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. దీంతో ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే, గురువారం ఉదయం మంత్రి జూపల్లి కృష్ణారావు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని, పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని, నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తామని బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి జూపల్లి హామీ ఇచ్చారు. దీంతో ఆయన మనస్సు మార్చుకుని కాంగ్రెస్ లోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జూపల్లి కృష్ణారావుతో కలిసి జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి ఆయన వెళ్లారు. సీఎం రేవంత్, కృష్ణ మోహన్ రెడ్డి మధ్య దాదాపు అరగంటపాటు మంతనాలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని రేవంత్ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డి స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది.
Admin
Studio18 News