Studio18 News - తెలంగాణ / : CM Revanth Reddy USA Tour : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనున్నారు. రేపు మంత్రి శ్రీధర్ బాబు, ఎల్లుండి మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అమెరికాకు వెళ్తారు. అమెరికాలో పలు నగరాల్లో పర్యటించి మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులతో సీఎం, మంత్రులు సమావేశం అవుతారు. పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామిక వేత్తలకు తెలంగాణలో ఉన్న అవకాశాలపై ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో పెద్దఎత్తున విదేశీ కంపెనీల ప్రాతినిధ్యం ఉండాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ముఖ్యంగా మూసీ ఆధునికీకరణ లాంటి ప్రాజెక్టుల విషయంలో విదేశీ సంస్థల సాయం ఉండాలని అనుకుంటున్నారు. ఫార్మా, టెక్ రంగాల్లో హైదరాబాద్ కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా మరిన్ని కంపెనీలను ఆకర్షించేందుకు సీఎం, మంత్రులు ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత రెండోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. గతంలో దావోస్ లో జరిగిన పెట్టుబడుల సదస్సుకు జనవరిలో రేవంత్ హాజరయ్యారు. పలు అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇటీవల మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు అమెరికాలో పర్యటించారు. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగుతున్నారు. ఈ అమెరికా పర్యటనలో ఎన్ఆర్ఐలతోనూ సీఎం సమావేశం అవుతారని సమాచారం. అనేక పెట్టుబడుల ప్రతిపాదనలు ఉన్నాయని, వాటిని ఫాలోప్ చేసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
Admin
Studio18 News