Studio18 News - తెలంగాణ / : తన మిత్రుడి ఫామ్ హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండి ఉంటే తాను దగ్గరుండి మరీ కూల్చివేయిస్తానని, కాంగ్రెస్ నేతల అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నాకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదు... కేటీఆర్ ఈ సందర్భంగా, జన్వాడ ఫామ్ హౌస్‌ను హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలపై మీడియా ప్రశ్నించింది. దీనిపై స్పందించిన కేటీఆర్, తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదన్నారు. తన మిత్రుడికి ఓ ఫామ్ హౌస్ ఉంటే తాను ఏడెనిమిదేళ్లు లీజుకు తీసుకున్నానన్నారు. ఆ ఫామ్ హౌస్ కనుక ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లో ఉండి ఉంటే కనుక తాను స్వయంగా వెళ్లి తన మిత్రుడితో మాట్లాడి... దగ్గర ఉండి మరీ కూలగొట్టించి వస్తానన్నారు. తప్పు ఉంటే కూలగొట్టడాన్ని తాను స్వాగతిస్తానన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి తాను ఓ సూచన చేస్తున్నానని... ఫామ్ హౌస్ కూల్చివేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా వచ్చి మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో కట్టిన నిర్మాణాలను కూడా కూల్చివేయాలని సవాల్ చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పట్నం మహేందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, మధు యాష్కీల నిర్మాణాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి నిర్మాణం కూడా ఎక్కడ ఉందో చూపిస్తామన్నారు. తాను స్నేహితుడి ఫామ్ హౌస్‌లో ఉంటున్నానని, అది ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే కూల్చేయవచ్చునని... తాను చెబితే తన స్నేహితుడికి కోపం వచ్చినా పర్వాలేదన్నారు. కానీ మంత్రి పొంగులేటి స్థలం నుంచి కూల్చివేతలను తిరిగి ప్రారంభించాలన్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటానంటే తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వీ6 వివేక్ ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ నీళ్లలోనే ఉందని, దానిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. రుణమాఫీ పచ్చి బూటకం, మోసమని అందరికీ అర్థమైంది రుణమాఫీ పచ్చి బూటకం, మోసమని అందరికీ అర్థమైందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డప్పు కొట్టుకున్నారని విమర్శించారు. తమకు రుణమాఫీ కాలేదని లక్షలాదిమంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీపై గ్రామాలు రణరంగంగా మారాయని మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు. రుణమాఫీ కోసం ఆందోళన చేస్తుంటే రైతులపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ జరగలేదని మంత్రులే చెబుతున్నారని, అందుకు సాంకేతిక కారణాలు చూపిస్తున్నారన్నారు. సీఎం, వ్యవసాయ మంత్రి రుణమాఫీ అయిందని చెబుతుంటే మంత్రులు మరోలా మాట్లాడుతున్నారన్నారు. రుణమాఫీ విషయంలో మంత్రులకే సమన్వయం లేదన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని నిరసిస్తూ రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న తెలంగాణ తల్లిని ఉద్దేశించి బజారు భాష మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ... ఆ మూర్ఖుడిని (రేవంత్) క్షమించాలని తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయాలని బీఆర్ఎస్ కేడర్‌కు పిలుపునిచ్చారు. పూర్తిస్థాయి రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నారు. అందుకు రైతుల్లో కేసీఆర్ భరోసా నింపడమే కారణమన్నారు.
Admin
Studio18 News