Studio18 News - తెలంగాణ / : నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలిసారిగా విద్యుత్‌ను అందించిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్లాంట్‌ను కూల్చివేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కేటీపీఎస్ కు చెందిన 8 కూలింగ్ టవర్లను అధికారులు కూల్చివేశారు. కాలం చెల్లడంతో 2020 ఏప్రిల్ 11న మెయింటెనెన్స్ ప్లాంట్ మూతబడింది. కూలింగ్ టవర్లు ఉన్న ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో వాటిని కూల్చివేయాలని కేటీపీఎస్ నిర్ణయించింది. ఈ క్రమంలో 2023 జనవరి 18 నుంచి పాత కర్మాగారానికి సంబంధించిన టవర్ల కూల్చివేత ప్రక్రియ పనులు జరుగుతున్నాయి. ఈ టవర్ల కూల్చివేతకు జెన్‌కో ద్వారా టెండర్లను ఆహ్వానించారు. హెచ్ఆర్ కమర్షియల్‌కు కొన్ని నెలల క్రితం రూ.485 కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చారు. పాత కేటీపీఎస్ ప్లాంట్‌లో 100, 120 మీటర్ల ఎత్తులో ఉన్న పలు కూలింగ్ టవర్లను గత ఫిబ్రవరిలో నేలమట్టం చేశారు. 1965-67 నుంచి 1978 వరకు దశలవారీగా నిర్మించిన ఏ, బీ, సీ పవర్ స్టేషన్లలో 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఎనిమిది కూలింగ్ టవర్లను నిర్మించారు. ఈ టవర్ల కూల్చివేత ప్రక్రియను జైపూర్‌కు చెందిన ప్రైవేటు సంస్థ చేపట్టింది. ట్రాన్స్‌కోతో పాటు జిల్లా కలెక్టర్ అనుమతులు పొందిన తర్వాత కూల్చివేత చేపట్టారు. 30 మంది సిబ్బంది దాదాపు నెల రోజుల పాటు సన్నాహాలు చేశారు. మూడు దశల్లో కూల్చివేత కొనసాగింది. మొదట 'ఏ' స్టేషన్‌లోని 102 మీటర్ల ఎత్తుగల నాలుగు కూలింగ్ టవర్లను, ఆ తర్వాత 115 మీటర్ల ఎత్తుగల నాలుగు టవర్లను రెండు దశల్లో నేలమట్టం చేశారు. వీటిని కూల్చేందుకు ఇంప్లోషన్ టెక్నిక్ ను ఉపయోగించారు.
Admin
Studio18 News