Studio18 News - తెలంగాణ / : Gossip Garage : కారు దిగి కాంగ్రెస్ చేతిని అందుకుంటున్న వలస ఎమ్మెల్యేలకు హస్తం పార్టీలో పరిస్థితులు అనుకూలించడం లేదా? బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేల జంపింగ్‌ను కాంగ్రెస్ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోందా? అధిష్టానం రా… రమ్మని ఆహ్వానిస్తున్నా.. దిగువ స్థాయిలో కార్యకర్తలు చేతులు కలపలేకపోతున్నారా? మొన్న జగిత్యాల.. నిన్న గద్వాల.. నేడు చేవెళ్ల.. ఇలా జంపింగ్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం ఎందుకు? హస్తం పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బలు.. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు…. హస్తం పార్టీలో ఎదురుదెబ్బలే తగులుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా బీఆర్‌ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వలస రాగా, ఒకరిద్దరికి తప్ప మిగిలిన చోట.. ఎమ్మెల్యేలను స్థానిక కాంగ్రెస్ నేతలు కలుపుకుని పోవడం లేదనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి చోట వలస ఎమ్మెల్యేలతో స్థానిక నేతలకు సమన్వయం చేయాల్సిన పార్టీ.. ఆ పని చేయకపోవడంతో రానురాను సమస్య జటిలం అవుతోందని అంటున్నారు. వలస ఎమ్మెల్యేలు వర్సెస్ స్థానిక నేతలు.. బుధవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయడాన్ని ఇందుకు ప్రధాన ఉదాహరణగా చెబుతున్నారు. బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారిలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి వర్గం సహాయ నిరాకరణ చేస్తోంది. అదేవిధంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి నియోజకవర్గ ఇన్‌చార్జి సరితతో పొసగడం లేదు. చేవెళ్లలోనూ పార్టీ ఇన్‌చార్జి భరత్‌తో ఎమ్మెల్యే యాదయ్య వర్గానికి గ్యాప్ కంటిన్యూ అవుతోంది. సీనియర్ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డికి పార్టీ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డికి మధ్య రాజీ కుదరలేదని ప్రచారం జరుగుతోంది. ఇక ఖైరతాబాద్‌లోనూ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇన్‌చార్జి విజయారెడ్డి వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. అందుకే.. వలసలకు బ్రేక్ పడిందా? ఇలా ఒకరిద్దరు తప్పితే మిగిలిన ఎమ్మెల్యేలు అంతా పార్టీ ఇన్‌చార్జులతో ఇబ్బందులు ఎదుర్కొంటు ఉండటమే.. వలసలకు బ్రేక్ పడిందనే వాదన వినిపిస్తోంది. 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుండగా, ఆయన లక్ష్యానికి గండి కొట్టేలా పార్టీ ఇన్‌చార్జులు ప్రవర్తిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. వలస ఎమ్మెల్యేలకు.. పార్టీ క్యాడర్‌కు మధ్య సమన్వయం కుదర్చాల్సిన పార్టీ విభాగం… అంతా సీఎం చూసుకుంటారులే అని వదిలేయడంతో రోజురోజుకు సమస్య తీవ్రమవుతోందంటున్నారు. డోంట్ కేర్ అంటున్న ఇంఛార్జ్ లు.. ఇలాంటి సమస్యలను పార్టీ పరంగా పరిష్కరించాల్సివున్నప్పటికీ… పీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్‌రెడ్డే కొనసాగుతుండటం వల్ల.. ఆయన పార్టీ వ్యవహారాలపై ఫోకస్ చేయలేకపోతున్నారు. ఇదే సమయంలో వివాదాలను చక్కదిద్దేందుకు ఆయా జిల్లా మంత్రులు ప్రయత్నిస్తున్నప్పటికీ…. ఇన్‌చార్జులు లెక్క చేయడం లేదు. అలాంటి వారిపై చర్యలు తీసుకునే అధికారం మంత్రులకు కూడా లేకపోవడంతో ధిక్కార స్వరాలను అదుపు చేయలేకపోతున్నారని అంటున్నారు. జగిత్యాలలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య రాజీ కుదర్చేందుకు ఆ జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రయత్నించినా, వృథా ప్రయాసే అయిందంటున్నారు. ఇక గద్వాలలోనూ మంత్రి జూపల్లికి ఎదురుదెబ్బే తగిలింది. తన శిష్యుడైన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని జూపల్లి కాంగ్రెస్‌లో తీసుకురాగా, ఆయన ఆధిపత్యాన్ని నిలదీస్తూ నిత్యం ఏదో రచ్చ చేస్తున్నారు పార్టీ ఇన్‌చార్జి సరిత. అధికార పార్టీలో చేరినా ప్రయోజనం ఏముంది? ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేరికకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి భరోసాతో కాంగ్రెస్‌లోకి వెళ్లినా… స్థానిక కాంగ్రెస్ నేతలతో ఇబ్బందులు కంటిన్యూ అయితే…. ప్రయోజనం ఏముంటుందని ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గుతున్నట్లు చెబుతున్నారు. మరి ఈ పరిస్థితులను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఎలా చక్కదిద్దుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Admin
Studio18 News