Studio18 News - తెలంగాణ / : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ కావడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి గద్వాల ఎమ్మెల్యేగా గెలుపొందిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఆ నియోజకవర్గ నేతలు బహిరంగంగానే వ్యతిరేకించారు. కాంగ్రెస్ నేతలతో సమన్వయం కుదరకపోవడం, పార్టీ అధిష్ఠానం సయోధ్య ప్రయత్నాలు చేయకపోవడం తదితర కారణాలతో ఆయన కొంత కాలంగా అసంతృప్తితోనే కాంగ్రెస్ లో కొనసాగుతున్నారని టాక్ నడిచింది. ఇటీవల ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తో భేటీ కావడంతో మళ్లీ పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా గత రెండు రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉండటంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఈ తరుణంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ లు నిన్న ఓ వ్యాపార వేత్త ఫామ్ హౌస్ లో చర్చలు జరిపినట్లు తెలుస్తొంది. వారి చర్చల మూలంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మెత్తబడినట్లు సమాచారం. మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే జీఎంఆర్ లు ఇవాళ (గురువారం) మరోమారు కృష్ణమోహన్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తదుపరి భేటీ అనంతరం ముగ్గురూ కలిసి ఒకే వాహనంలో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు గద్వాల నుండి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. దాంతో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతారనే టాక్ నడుస్తొంది. ఈ అంశంపై నేటి సాయంత్రం కృష్ణమోహన్ రెడ్డి మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Admin
Studio18 News