Studio18 News - తెలంగాణ / : సూర్యాపేట జిల్లాలో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించామని తెలిపారు. తెలంగాణలో 5 వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వస్తున్నాయని చెప్పారు. వెంటనే కేంద్రం 2 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని కోరుతున్నానని అన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు పని చేయాలని, రాజకీయాలకు ఇది సమయం కాదని చెప్పారు. సూర్యాపేట జిల్లాలో 30 సెంటిమీటర్ల అతి భారీ వర్షం పడిందని తెలిపారు. అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారని, పంట, ఆస్తి నష్టంపై అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వం నిరంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఖమ్మం, నల్లగొండ పరిస్థితి పైన ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీకి వివరించి సాయం కోరానని అన్నారు. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. పశువులు చనిపోతే 50 వేల రూపాయల సాయం, పంట నష్టం జరిగితే ప్రతి ఎకరానికి 10 వేల రూపాయల సాయం, ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. పాఠశాల సెలవులపై జిల్లా కలెక్టర్లకు నిర్ణయాధికారం ఉంటుందని తెలిపారు.
Admin
Studio18 News