Studio18 News - తెలంగాణ / : hyderabad rains: హైదరాబాద్ నగరంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం ప్రారంభమైంది. ఉదయమంతా ఎండగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం సమయానికి మారిపోయింది. దట్టమైన మేఘాలు అలముకుని, ఉరుములతో వాన మొదలైంది. హైటెక్ సిటీ, కొండాపూర్, పంజాగుట్ట, అమీర్ పేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్ సర్కిళ్ల పరిధిలో వాన ఎక్కువగా కురుస్తోంది. దీంతో రోడ్లపైకి పెద్ద ఎత్తున నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మరికొన్ని గంటల పాటు వర్షం కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తమయ్యాయి. నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. కాగా, తెలంగాణలో మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Admin
Studio18 News