Studio18 News - తెలంగాణ / : Gossip Garage : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వైద్యులు, సిబ్బంది బదిలీల్లో అంతులేని అవినీతి చేటుచేసుకుంటోందని విమర్శలు వినిపిస్తున్నాయి. డాక్టర్ల బదిలీల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయంటున్నారు. ఈ అవినీతి బాగోతంపై ఇంటెలిజెన్స్ కూడా ఆరా తీస్తోందట. పెద్ద ఎత్తున వసూళ్ల జరిగాయని ప్రభుత్వానికి నివేదిక రెడీ చేసిందంటున్నారు. ఇప్పుడు ఇదే విషయం సెక్రటేరియట్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. కోరుకున్న చోట పోస్టింగ్ కోసం లక్షల్లో సమర్పణ? తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖలో అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సిబ్బంది బదిలీల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. కోరుకున్న చోట పోస్టింగ్ కోసం ఉద్యోగులు లక్షల్లో సమర్పించుకుంటున్నారని ఆరోపణలు వినిపస్తున్నాయి. నిబంధనల ప్రకారం సీనియార్టీ జాబితా తయారు చేసి బదిలీలు చేయాల్సివుండగా, ఈ జాబితాలో కొందరి పేర్లు మాయం చేయడం, మరికొందరి పేర్ల నమోదులో తప్పుడు వివరాలు పొందుపరచడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు చేతులు మారినట్లు గుసగుసలు.. రాష్ట్రంలో బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో చాలా ఏళ్లుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సీట్లను కాపాడుకునేందుకు పైరవీలు చేస్తున్నట్లు చెబుతున్నారు. దిగువస్థాయిలో పనిచేసే నర్సుల నుంచి మొదలుకొని వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల వరకు అంతా ప్రస్తుత పోస్టుల్లోనే కొనసాగేలా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. మరికొందరు తమకు నచ్చిన ప్రాంతానికి బదిలీ కోరుతూ లక్షల రూపాయలు ముట్టజెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుంచి డైరెక్టరేట్‌లోని కొందరు ఉద్యోగులు, పలు అసోసియేషన్ల నాయకులు వసూళ్లకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఉద్యోగులు…. పోస్టింగ్ కోసం డబ్బు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంత డబ్బైనా చెల్లించడానికి రెడీ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న చాలా మంది వైద్యులు మరోవైపు సొంతంగా ప్రైవేట్ హాస్పిటళ్లు, క్లినిక్స్ నడుపుతున్నారు. మరికొందరు కార్పొరేట్ హాస్పిటల్స్ లో కన్సల్టెంట్ వైద్య సేవలు అందిస్తున్నారు. రెండు వైపులా దండిగా సంపాదిస్తుండటంతో ప్రస్తుతం ఉన్న స్థానంలోనే కొనసాగేలా ప్రయత్నిస్తున్నారు. అక్కడ కుదరదంటే పక్కనే ఉన్న మరోచోటకు బదిలీ చేయాలని కోరుతున్నారట.. ఇలాంటి వారు సౌకర్యమైన పోస్టింగ్ కోసం ఎంత డబ్బైనా చెల్లించడానికి రెడీ అంటున్నారట.. హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న సిబ్బంది ఎక్కువగా ఈ లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆరోపణలపై రాష్ట్ర పోలీసు ఇంటిలెజెన్స్ విభాగం ఫోకస్.. నగరంలో చాలాకాలంగా తిష్టవేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాల్సి వస్తే జూబ్లీహిల్స్ నుంచి మలక్ పేట్, లేదంటే కోఠి ఆస్పత్రికి బదిలీ చేస్తున్నారని చెబుతున్నారు. ఇలా అటు నుంచి ఇటు… ఇటు నుంచి అటు వెళ్లేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా ఎక్కువగా ఫిర్యాదులు వస్తుండటంతో రాష్ట్ర పోలీసు ఇంటిలెజెన్స్ విభాగం ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. ఎవరెవరు వసూళ్లకు పాల్పడుతున్నదీ? ఎవరికీ ఎంత డబ్బు అందుతున్నది ప్రభుత్వానికి నివేదించేందుకు రిపోర్టు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటిలెజెన్స్ నివేదికపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సివుంది.
Admin
Studio18 News