Studio18 News - తెలంగాణ / : తెలంగాణలోని ప్రతిపక్ష నేతలు రైతులలో అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని జలసౌధలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్ర్య భారతంలో ఎక్కడ కూడా ఇలా రుణమాఫీ జరగలేదని అన్నారు. మన్మోహన్ సింగ్ దేశ వ్యాప్తంగా రుణమాఫీ చేసిన తరువాత బీజేపీ ఎప్పుడూ అలా రుణమాఫీ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని, వివిధ కారణాలతో రుణమాఫీ కాని వారికి కూడా చేసి తీరతామని చెప్పారు. ఈ పంట నుంచి సన్నాలకి రూ.500 బోనస్ ఇవ్వబోతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు రైతుల జీవితాలను ఆగం చేసిందని చెప్పారు. రెండు లక్షలకు పైగా రుణం తీసుకున్న వారు పై అమౌంట్‌ను బ్యాంక్ లో కట్టాలని, తాము ఆ రెండు లక్షలు మాఫీ చేస్తామని తెలిపారు. వాళ్లు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు: జూపల్లి మంత్రి జూపల్లి కృష్ణారావు రుణమాఫీపై మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రుణమాఫీలో చాలా తప్పులు చేసిందని అన్నారు. కేటీఆర్, హరీశ్ రావు సవాల్ విసిరి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ రుణమాఫీని జీర్ణించుకోలేక పోతున్నాయని తెలిపారు. దేశంలో ఏ ప్రభుత్వమూ ఇలా రుణమాఫీ చేయలేదని, తమ ప్రభుత్వం మాత్రమే చేసిందని, తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
Admin
Studio18 News