Studio18 News - తెలంగాణ / : Telangana Floods : భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతోపాటు రహదారులు దెబ్బతిని పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో పాల్గొంటూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తెలంగాణలో మంగళవారం కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా 11 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్, మేడ్చల్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వరద ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తుగానే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని, భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. భారీ వర్షాలతోపాటు.. వరదల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా అదిలాబాద్, ఖమ్మం జిల్లాలతోపాటు పలు జిల్లాలకు మంగళవారం కూడా విద్యా సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఇదిలాఉంటే.. బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఈనెల 5, 6 తేదీల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు. ఇది తుపానుగా మారి.. విశాఖపట్టణం, ఒడిశా దిశగా ప్రయాణించి తీరందాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Admin
Studio18 News