Studio18 News - తెలంగాణ / : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఏఐసీసీ అగ్రనేతలను పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడి మార్పు, మంత్రివర్గంలో మార్పులు, పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఈ భేటీలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్ విస్తరణపై గతంలోనూ పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే రాష్ట్ర ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. మంత్రివర్గంలో నలుగురికి చోటు? మంత్రివర్గంలోకి మరో ఆరుగురిని తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం నలుగురిని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాబితాలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకాటి శ్రీహరి ముదిరాజ్‌లలో నలుగురికి చోటు దక్కనుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవిలో బీసీల నుంచి మధుయాష్కీ గౌడ్, మహేశ్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని వీరిలో ఒకరికి అవకాశం దక్కవచ్చునని భావిస్తున్నారు.
Admin
Studio18 News