Studio18 News - తెలంగాణ / : Outer Ring Road : హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు టైరు ఢీకొని మూత్ర విసర్జన చేస్తున్న ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా.. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం బాలుడు కన్నుమూశాడు. ఈ ఘనటపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమీన్ పూర్ మండలం పటేల్ గూడ గ్రామానికి చెందిన సందీప్ రెడ్డి ఆదివారం రాత్రి ముత్తంగి దాబాలో భోజనం చేసేందుకు కారులో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. సుల్తాన్ పూర్ వద్ద ఓఆర్ఆర్ ఎక్కిన కొద్దిసేపటికి అతని కుమారుడు మోక్షిత్ రెడ్డి (6) మూత్రం వస్తుందని చెప్పడంతో కారు ఓఆర్ఆర్ పక్కన నిలిపాడు. మోక్షిత్ రెడ్డి రోడ్డు పక్కకు వెళ్లి మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన వేగంగా దొర్లుకుంటూ వచ్చిన కారు టైరు బాలుడ్ని ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన తల్లిదండ్రులు వెంటనే ముత్తంగిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం వేరే ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం బాలుడు మృతి చెందాడు. ఊహించని ఘటనతో బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, బాలుడిని ఢీకొట్టిన కారు టైరు ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓఆర్ఆర్ పై వెళ్తుండగా ఏదైనా వాహనం టైరు ఊడిపోయి ఉండవచ్చునని, అది వేగంగా వచ్చి బాలుడిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Studio18 News