Studio18 News - తెలంగాణ / : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం తెలంగాణ సర్కార్ మహాలక్ష్మి పేరిట ఓ ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ పథకం ఎంత పాప్యులర్ అయిందో, అంతే విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. ఇటీవల ఈ స్కీమ్‌ను అడ్డుపెట్టుకుని కొంతమంది కండక్టర్లు అడ్డదారులు తొక్కుతున్నారని ఓ నెటిజన్ ఆరోపించారు. దీనిపై టీజీఎస్ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. అసలేం జరిగిందంటే.. ఆర్‌టీసీ బస్సుల్లో కొంతమంది కండక్టర్లు మహాలక్ష్మి పథకాన్ని తమ జేబులు నింపుకోవడానికి వినియోగించుకుంటున్నారనేది ఆ నెటిజన్ ఆరోపణ. పురుషుల వద్ద టికెట్ కోసం డబ్బులు తీసుకుని, మహిళలకు ఇచ్చే జీరో టికెట్ ఇస్తున్నట్లు నెటిజన్ ఆరోపించారు. అదేంటని అడిగితే... పొరపాటున ఇచ్చినట్లు చెప్పి, ఆ టికెట్‌ను చించివేసి ఇంకో టికెట్ ఇస్తున్నారట. దీనికి స్వయంగా తనకు జరిగిన అనుభవాన్ని నెటిజన్ ఉదహరించడం గమనార్హం. జూన్ 26న, జూలై 7న, ఆగస్టు 4న ఇలా మూడుసార్లు తన వద్ద డబ్బులు తీసుకుని మహాలక్ష్మి పథకానికి సంబంధించిన జీరో టికెట్ ఇచ్చినట్లు వాటి తాలూకు ఫొటోలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన షేర్ చేశారు. ఇది లూటీ వ్యవహారం అని, దీనిపై దృష్టిసారించాలంటూ ఎండీ సజ్జనార్‌కు ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన సజ్జనార్ ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రయాణికుడికి కలిగి అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మహాలక్ష్మి జీరో టికెట్లపై ఆర్‌టీసీ ఉన్నతా ధికారులు దృష్టిసారించాల్సిన అవసరముందంటూ నెటిజన్లు చెబుతున్నారు. ఈ మోసాలను ప్రారంభంలోనే నిలువరించాలని వారు కోరుతున్నారు.
Admin
Studio18 News