Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్ శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద అవుటర్ రింగ్ రోడ్డు పై భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఓ పక్క తెలుగు రాష్ట్రాల్లో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా, నిరంతరం తనిఖీలు చేస్తున్నా పెద్ద ఎత్తున గంజాయిని కంటైనర్ లో పట్టుబడటం పోలీసులకు సవాల్ గా మారుతోంది. శనివారం రాత్రి పెద్ద అంబర్ పేట వైపు నుండి గచ్చిబౌలి వైపు వెళుతున్న ఒక కంటైనర్ లో సుమారు 800 కేజీల గంజాయి ఉండడాన్ని గమనించిన బాలానగర్ ఎస్ వో టీ పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కంటైనర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియా సమావేశంలో పోలీసులు వెల్లడించనున్నారు. ఒడిశా నుండి ఓ ముఠా ఈ గంజాయిని తరలిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ గంజాయి తరలింపు వెనుక ఎవరు ఉన్నారు. ఎక్కడకు వెళుతుంది అనే వివరాలు పోలీసుల విచారణలో తేలనుంది. అయితే ఓ పక్క తెలుగు రాష్ట్రాల పోలీసులు గంజాయి అక్రమ రవాణా నిరోధానికి చర్యలు చేపడుతున్న వేళ ఒడిశా నుంచి అన్ని చెక్ పోస్టులను దాటుకుని హైదరాబాద్ వరకూ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Admin
Studio18 News