Studio18 News - తెలంగాణ / : తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దిలీప్‌ను సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పులను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినందుకు ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా పేర్కొంది. ఆయన అరెస్టును బీఆర్ఎస్ నేతలు ఖండిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దిలీప్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ప్రజా పాలన అంటే ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కడమేనా? అని కేటీఆర్ నిలదీశారు. దిలీప్‌ను అక్రమంగా అదుపులోకి తీసుసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థతను, చేతగానితనాన్ని దిలీప్ కొంతకాలంగా ప్రశ్నించటాన్ని రేవంత్ సర్కార్ తట్టుకోలేకపోతోందన్నారు. కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టినా బుద్ధి రాలేదన్నారు. ఎలాగైనా దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. కనీస సమాచారం ఇవ్వకుండా ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా అరెస్ట్ చేశారని విమర్శించారు. అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చనుకుంటే అది మీ భ్రమే అవుతుందని హెచ్చరించారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు మరింతమంది పుట్టుకు వస్తారన్నారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్న దిలీప్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తొమ్మిది నెలలుగా తెలంగాణలో వాక్ స్వాతంత్రం లేదని, నిరంకుశ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.
Admin
Studio18 News