Studio18 News - తెలంగాణ / : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషి మృతి చెందాడు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) కన్నుమూశాడు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఖైదీగా ఉన్న అతడు అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన మక్బూల్‌కు దేశవ్యాప్తంగా జరిగిన పలు బాంబు పేలుడు ఘటనలతో సంబంధం ఉన్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. అతడిపై హత్య, హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయి. ఇక 2013 నాటి దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మక్బూల్‌కు జీవిత ఖైదు విధించింది. ఆరు నెలల క్రితం అతడిపై హైదరాబాద్‌లో మరో కేసు కూడా నమోదైంది. దీంతో, పోలీసులు ట్రాన్సిట్ వారెంట్‌పై మక్బూల్‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం సుమారు ఏడు గంటల సమయంలో ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీలు పేలాయి. ఈ ఘటనలో 18 మంది మృతిచెందారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్‌స్టాప్ వద్ద ఐఈడీ పేలిన ఆరు సెకెన్లకు ఏ1 మిర్చీ సెంటర్ వద్ద మరో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 126 మంది గాయపడగా, వీరిలో 78 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో కొందరు ఇప్పటికీ మంచానికే పరిమితమయ్యారు.
Admin
Studio18 News