Studio18 News - తెలంగాణ / : BRS MLA Harish Rao : తెలంగాణలో రుణమాఫీపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య రచ్చ జరుగుతోంది. రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ ఇచ్చిన మాట ప్రకారం, చెప్పిన గడువులోపు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గడువులోపు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పూర్తిచేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు సవాల్ చేశాడని, వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సిద్ధిపేటలో అర్థరాత్రి ప్లెక్సీలు సైతం వెలిశాయి. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఆందోళనతో సిద్ధిపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ మేరకు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. 46శాతం మంది రైతులకే రుణమాఫీ జరిగిందని, 54శాతం రైతులకు రుణమాఫీ చేయలేదని అన్నారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెబుతుంది. రుణమాఫీ పూర్తయిందని ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రూ. 31వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందని చెప్పి.. రూ. 17వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేయడం ఏమిటని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఏ రకంగా రుణమాఫీ చేశామని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. ఇంకా 54శాతం మంది రైతులకు రుణమాఫీ చేయలేదని హరీశ్ రావు అన్నారు. రూ.14వేల కోట్లు కోతపెట్టారని మిర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి నేను సవాల్ చేస్తున్నా.. ప్లేస్, డేట్, టైమ్ రేవంత్ రెడ్డి చెప్పాలి.. తెలంగాణలో ఎక్కడికైనా వెళ్లి రైతులను అడుగుదాం. రుణమాఫీ పూర్తిగా అయ్యిందో లేదో రైతులే చెబుతారని హరీశ్ రావు అన్నారు. రుణమాఫీ జరగలేదని మా కాల్ సెంటర్ కు 1.15లక్షలకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. రుణమాఫీపై శ్వేతప్రతానికి సిద్ధమా అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలతోపాటు రైతు రుణమాఫీ పూర్తిగా అమలుచేస్తే రాజీనామా చేస్తానని అప్పుడే చెప్పా.. ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు బాగా తెలుసు. రైఫిల్ పట్టుకుని రైతుల మీదకు వెళ్లిన చరిత్ర రేవంత్ రెడ్డిది. రాష్ట్రంకోసం పదవులను వదిలేసిన చరిత్ర మాది అంటూ హరీశ్ రావు అన్నారు.
Admin
Studio18 News