Studio18 News - తెలంగాణ / : Cell Phone Driving Cases : సెల్‌ఫోన్…వాహనదారుల కొంప ముంచుతోంది. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడిపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ధ్యాసంతా ఫోన్‌పైనే ఉండడంతో వాహనం ఎటువైపు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి. ఫోన్ మాట్లాడుతూ, చాటింగ్ చేస్తూ.. పాటలు వింటూ…ట్రాఫిక్‌తో సంబంధం లేకుండా వాహనాలు వడుపుతున్నారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా వినకుండా వాహనదారులు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసుల సంఖ్య.. ప్రతి మనిషికి సెల్‌ఫోన్‌తో విడదీయరాని బంధం ఏర్పడింది. ఇది ఎంతగా పెనవేసుకుపోయిందంటే ప్రతి పనికి మొబైల్‌ఫోన్‌పైనే మనిషి ఆధారపడుతున్నాడు. ఇంటా… బయటా ఎక్కడున్నా ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. అయితే రోడ్డుపై డ్రైవింగ్ చేసే సమయంలో కూడా సెల్‌ఫోన్ వినియోగించడం ప్రమాదాలకు దారితీస్తోంది. సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని తెలిసినా డోంట్ కేర్ అంటున్నారు వాహనదారులు. హైదరాబాద్ నగరంలో సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేసే కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. సెల్ ఫోన్ డ్రైవింగ్ తో ప్రమాదాల బారిన పడుతున్నారు.. సెల్‌ఫోన్ డ్రైవింగ్ వల్ల జరిగే నష్టాలు అన్ని ఇన్నీ కావు. వాహనం నడుపుతూ ఫోన్ వినియోగించడం, కాల్స్ మాట్లాడడం వల్ల దృష్టి మళ్లుతుంది. ధ్యాసంతా ఫోన్‌పైనే ఉండడం వల్ల ఇరువైపుల నుంచి వచ్చే వాహనాలను గమనించలేరు. వీరికి హారన్ శబ్ధాలు కూడా వినిపించవు. ఒక చేత్తో డ్రైవింగ్… మరో చేతిలో ఫోను… అకస్మాత్తుగా స్పీడ్ బ్రేకర్లు, ఎదురుగా ఏదైనా వస్తే వాహనంపై నియంత్రణ కోల్పోయి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఫోన్ స్క్రీన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనం లేన్ ప్రకారం కాకుండా అటు ఇటుగా వెళ్తుంది. దీంతో ఇరువైపుల వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్నిసార్లు ఫోన్ జారిపోతుంటే దాన్ని పట్టుకోబోయి ప్రమాదాలకు లోనవుతున్నారు. బైక్‌పై వెళుతూ ఫోన్‌లో రీల్స్ చూసే వారి సంఖ్య పెరుగుతోంది.. నగరంలో రోడ్ల మీదకొచ్చే వాహనాల డ్రైవర్లలో సగటున 15 శాతం మంది సెల్‌ఫోన్లు ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. హ్యాండ్ ఫ్రీ మోడ్ పరికరాలు ఉపయోగించే వారు 70 శాతం వరకూ ఉంటారని అంచనా. కాల్ వచ్చినప్పుడు వాహనాన్ని పక్కకు నిలిపి మాట్లాడే వారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే వీకెండ్స్‌లోనే సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వీటికన్నా ఇప్పుడు బైక్‌పై వెళుతూ ఫోన్‌లో రీల్స్ చూసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఫోన్‌లో మాట్లాడ్డమే ప్రమాదం అనుకుంటే, కళ్లప్పగించి రీల్స్ చూస్తూ డ్రైవింగ్ చేస్తుండడం ట్రాఫిక్ పోలీసులను సైతం విస్మయానికి గురి చేస్తోంది. 3 కమిషనరేట్ల పరిధిలో 1లక్షా 15వేల 229 కేసులు నమోదు.. గత కొన్నాళ్లుగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పోలీసులు చలానాలు విధిస్తున్నా ఏటా సగటున 20-30 శాతం కేసుల్లో వృద్ధి కనిపిస్తోంది. 2023 నుంచి 2024 జులై వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 89,056.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 9,773.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 16,400 సెల్‌ఫోన్ డ్రైవింగ్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. మొత్తం మూడు కమిషనరేట్ల పరిధిలో 1లక్షా 15వేల 229 నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వాహనం నడిపే సమయంలో సెల్‌ఫోన్ వినియోగిస్తే ట్రాఫిక్ పోలీసులు 1000 రూపాయల జరిమానా విధిస్తున్నారు. డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడాలంటేనే భయపడేలా చర్యలు ఉండాలి.. డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరే సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా వాహనదారులు పట్టించుకోవడం లేదు. ఫోన్ మాట్లాడుతూ దొరికితే… వారి లైసెన్సులో రెండు పాయింట్లు నమోదవుతాయి. ఇది 12కు చేరితే డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేస్తారు. మొబైల్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేసే వారిలో 18 నుంచి 35 ఏళ్ల వయసు వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఫోన్లు వినియోగించే వారికి చలానాలు విధిస్తుండడంతో చెవులకు బ్లూటూత్ తగిలించుకుని డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో వీరు చలానాల నుంచి తప్పుకుంటున్నారు. హ్యాండ్ ఫ్రీ విధానం కింద బ్లూటూత్ వినియోగిస్తే జరిమానా విధించలేరు. దీంతో కొందరు బ్లూటూత్ పరికరాలతో పాటలు వింటూ, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండడంతో ప్రమాదాలు తప్పడం లేదు. ఇకపై ట్రాఫిక్ పోలీసులు బ్లూటూత్, ఇయర్‌ఫోన్స్‌పై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడాలంటేనే భయపడేలా అధికారులు చర్యలు చేపట్టాలి. అపుడే సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదాలను అరికట్టేందుకు వీలవుతుంది.
Admin
Studio18 News