Studio18 News - తెలంగాణ / : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల పంప్ హౌస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సాగర్ జలాల ఒత్తిడికి ఇన్ టేక్ వెల్ టన్నెల్ రక్షణ గోడ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. అక్కడి కూలీలు షిఫ్ట్ మారడానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పంప్ హౌస్ నీటమునిగినప్పటికీ అధికారులు, నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. వారం రోజుల క్రితమే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ కు చేరేవరకు సుంకిశాల పథకం పనులు నిలిచి పోనుంది. అధికారులు, నిర్మాణ సంస్థ అవగాహన లోపం వల్లే ప్రమాదం జరిగిందంటూ విమర్శలు వస్తున్నాయి. ఆ పంప్ హౌస్‌లో షిఫ్ట్‌కు 115 మంది వరకు కూలీలు పనిలో ఉంటారు. సాగర్ డెడ్ స్టోరేజ్‌కు చేరిన సమయంలో హైదరాబాద్‌కు తాగునీటిని అందించడానికి ఈ పథకాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా సొరంగ మార్గం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సొరంగంలోకి సాగర్ నీరు రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. సాగర్ నిండిపోవడంతో నీటి ఒత్తిడికి రక్షణ గోడ కుప్పకూలింది. కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
Admin
Studio18 News