Studio18 News - తెలంగాణ / : MP Dharmapuri Arvind : బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యంకాని హామీలు ఇచ్చిందని, రైతులను, మహిళలను మోసం చేసిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 30శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ దక్కిందన్నారు. రూ.2లక్షలు రైతులు ముందు చెల్లించాక ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ ఏంది అని ప్రశ్నించారు. రేవంత్ రొటేషన్ చక్రవర్తి అంటూ అరవింద్ ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రుణమాఫీ చేసిన తీరు అభినందనీయం. ప్రజల్లో ప్రభుత్వం తీరుపై రోజురోజుకు అసహనం పెరుగుతుందని అరవింద్ అన్నారు. బీజేపీ తలపెట్టిన రేపటి రైతు దీక్షను విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులను, ప్రజలను కోరారు. కేసీఆర్ లాగే రేవంత్ రెడ్డి కూడా అబద్ధాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నాడని విమర్శించారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని అరవింద్ డిమాండ్ చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవ్వటం సాధ్యం కాదన్నారు. బీఆర్ఎస్ ను దగ్గరకు రానిచ్చే ప్రసక్తే లేదని అరవింద్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు.. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినట్లేనని అన్నారు. పార్టీ అభ్యర్థులను, పార్టీని గెలిపించే వారినే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని పార్టీ అధిష్టానానికి ఎంపీ అరవింద్ సూచించారు.
Admin
Studio18 News