Studio18 News - తెలంగాణ / : పార్లమెంట్లో బీసీ కుల గణన బిల్లు పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు డిమాండ్ చేశారు. ఇవాళ వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్లో అనురాగ్ ఠాకూర్ దిగజారి మాట్లాడారని, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. దేశానికి ఓ బీసీ ప్రధాన మంత్రి అయ్యారని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చెబుతున్నారని అన్నారు. అయితే, ఓబీసీ ఎంపీలం అందరం కలిసి బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని గతంలో ప్రధానమంత్రిని కలిశామని, కానీ ఇప్పటి వరకు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టలేదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో ఒక ఆలోచన వచ్చిందని, రాహుల్ గాంధీ వైపు ఆశగా చూస్తున్నారని అన్నారు. ఈ సారి కుల గణన జరగాలంటే రాహుల్ గాంధీ రావాలని అందరూ కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో బీసీ కుల గణనకు రూ.150 కోట్లు కేటాయించారని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే కులగణనకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగాలంటే కుల గణన జరగాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్లో నిధులు కేటాయించారని తెలిపారు. నరేంద్ర మోదీ మాత్రం కుల గణనపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని చెప్పారు. చంద్రబాబు నాయుడుకి ఓ విజ్ఞప్తి చేస్తున్నానని, ఏపీలో కుల గణన చేయాలని అన్నారు.
Admin
Studio18 News