Studio18 News - తెలంగాణ / : Godavari Floods : గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గంటగంటకు గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. నదీ పరీవాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒడిశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని, శబరి, కడెం ఉప నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆ నీరంతా గోదావరిలో చేరుతుండటంతో వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగుల వద్దకు చేరుకోగా.. సోమవారం ఉదయం 7గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 46.4 అడుగులకు చేరింది.భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతుండటంతో ఆదివారం సాయంత్రమే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆదివారం రాత్రి 11గంటలకు గోదావరి నీటిమట్టం 44.8 అడుగులకు చేరింది. సోమవారం ఉదయం 46.4 అడుగులకు నీటిమట్టం చేరింది. 10,68,602 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. 53 అడుగులకే చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇప్పటికే అలర్ట్ గా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచనలు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాలతోపాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే గోదావరి నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 50అడుగులు దాటే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు భద్రాచలం వద్ద గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 1986 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 75.60 అడుగులకు చేరింది. గోదావరి వరద 73అడుగుల స్థాయిని తాకితే పరీవాహక ప్రాంతాల్లో 109 గ్రామాలు, భద్రాచలం పట్టణం ముంపునకు గురవుతాయని నీటిపారుదల శాఖ ప్రకటించింది. 48 అడుగుల స్థాయి నుంచే పలు గ్రామాలకు ముప్పు మొదలవుతుందని సూచించింది. 2023లో గోదావరి నీటిమట్టం 73 అడుగుల స్థాయిని దాటిన సంగతి తెలిసిందే. దీంతో గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతుండటంతో అధికారులు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
Admin
Studio18 News