Studio18 News - తెలంగాణ / : ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరకట్టాలని పాలకులు ఎంతగా ప్రయత్నిస్తున్నా కొందరు అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రజలకు పనులు చేయాలంటే ఎంతో కొంత డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. తెలంగాణలో మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. ఓ రైతు పహాణీ పత్రం కోసం వెళితే తహసీల్దార్ పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. కరీంనగర్ జిల్లా ఓదెల మండలం కొమిరె గ్రామానికి చెందిన కాడం తిరుపతి అనే రైతు ఇటీవల తాను కొనుగోలు చేసిన భూమిని తండ్రి మల్లయ్య పేరిట పట్టా చేసుకోవడానికి పలుమార్లు తహసీల్దార్ జాహేద్ పాషాను సంప్రదించాడు. ఆయన రూ. 50వేలు లంచం డిమాండ్ చేయడంతో మూడు దఫాలుగా ఆయన అసిస్టెంట్ ధర్మేందర్‌కు లంచం ముట్టజెప్పాడు. అయినా పట్టా ఇవ్వకపోవడంతో ప్రజావాణికి ధరఖాస్తు చేసుకున్నాడు. దీంతో పట్టాదారు పాసుపుస్తకం వచ్చింది. అయితే బ్యాంక్ రుణం తీసుకునేందుకు గానూ పహాణీ నకలు అవసరం కావడంతో తిరుపతి మళ్లీ తహసీల్దార్ వద్దకు వెళ్లాడు. మరో రూ. పదివేలు లంచంగా ఇస్తేనే పహాణీ నకలు పత్రాలు ఇస్తానని చెప్పడంతో ఇక లంచం ఇవ్వలేని తిరుపతి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. నిన్న జుహేద్ పాషా డ్రైవర్ అంజద్ పాషా, సహాయకుడు దాసరి ధర్మేందర్‌కు రైతు లంచం ఇస్తుండగా, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Studio18 News