Studio18 News - తెలంగాణ / : malakpet blind school: ప్రభుత్వాలు ఎంత కఠిన చట్టాలు చేస్తున్నా చిన్నారులపై పైశాచిక దాడులు ఆగడం లేదు. అభంశుభం తెలియని పిల్లలపై అకృత్యాలకు అడ్డుకట్ట పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజు ఏదోకచోట చిన్నారులపై దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ మలక్‌పేటలో మరో పైశాచికం వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల అంధ బాలికపై కామాంధుడొకడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటపడింది. మలక్‌పేటలో ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో ఈ దారుణ ఘటన జరిగింది. బాత్రూంలు శుభ్రంచేసే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. వికారాబాద్ జిల్లాకు బాలిక మలక్‌పేటలోని అంధ బాలికల వసతి గృహంలో ఉంటూ అక్కడే చదువుకుంటోంది. ఈ నెల 7న ఉదయం బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో వసతి గృహం నిర్వహకులు ఆమె తల్లిదండ్రులను పిలిచి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రాణాపాయంలో ఉన్న తమ కుమార్తెను ఆస్పత్రికి తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వసతి గృహం సిబ్బందిపై బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు కూడా పట్టించుకోలేదు. దీంతో చేసేది లేక బాలికను నిలోఫర్ ఆస్పత్రిలో చేర్చారు. నిలోఫర్ వైద్యుల సమాచారంతో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. విషయం తెలియడంతో బాలిక తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాలతో కలిసి మలక్‌పేట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.
Admin
Studio18 News