Studio18 News - TELANGANA / : CM Revanth Reddy : హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన భవనాలను హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బుధవారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైడ్రా కూల్చివేతలు ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే పరిమితం అని చెప్పారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, పార్కులు, నాలాలు కబ్జాలు చేసి నిర్మాణం చేపట్టిన భవనాలే మా మొదటి ప్రాధాన్యత. చెరువులు కబ్జా చేసిన ఎవర్నీ వదిలిపెట్టేది లేదని రేవంత్ మరోసారి స్పష్టం చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నా కుటుంబ సభ్యులు, బంధువుల కట్టడాలు ఉంటే వివరాలు ఇవ్వండి.. నేనే వచ్చి దగ్గర ఉండి కూల్చివేయిస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్ ఫామ్ హౌజ్ లీజ్ తీసుకున్న విషయం ఎన్నికల అఫిడవిట్లో చూపించారా? చూపించకుంటే న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని రేవంత్ అన్నారు. కేటీఆర్ స్నేహితుడు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో ఫామ్ హౌజ్ కడితే నిబంధనలు ఉల్లంఘించిన ప్రాపర్టీస్ కేటీఆర్ ఎలా తీసుకుంటాడని రేవంత్ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. మొదటగా మా పార్టీకి చెందిన పళ్లం రాజు ఫామ్ హౌజ్ నే హైడ్రా కూల్చింది. చెరువు శిఖం భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దు. వ్యవసాయం చేసుకుంటే ఇబ్బంది లేదని రేవంత్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ రూ.2లక్షలపైన రుణం తీసుకున్న వారు పైమొత్తాన్ని కడితే రుణమాఫీ అయిపోతుంది. వాటికి నిధులు కూడా విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హరీశ్ రావు, కేటీఆర్ లు ప్రతి ఇంటికి వెళ్లి రుణమాఫీ కానివారి లెక్కలు సేకరించి కలెక్టర్ కు ఇవ్వండి. నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. కలెక్టర్లకు ఇస్తే సరిపోతుంది. రుణమాఫీ విషయంలో సవాల్ చేసిన హరీశ్ రావు రాజీనామా చేయకుండా పోరిపాయాడు. ఆయన దొంగ అని ముందే తెలుసు. ఆగస్టు 15న రుణమాఫీ చేయాలని విదేశీ పర్యటనలోఉన్నా అర్దాంతరంగా వచ్చి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ చెప్పారు.
Admin
Studio18 News