Studio18 News - తెలంగాణ / : బీఆర్ఎస్ కుటుంబ సభ్యుడు అరికెపూడి గాంధీని తాము కలిసేందుకు వెళ్తే తప్పేంటని బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రశ్నించారు. ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తోందని నిలదీశారు. పోలీసులు అక్కడ కేపీ వివేకానంద ఇంటి వద్ద నిర్బంధం విధించారని, ఇక్కడ తమ ఇంటిని నాలుగు వైపుల చుట్టుముట్టారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా తమ బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ పోలీసుల కుట్రలను ఛేదించి చాలా మంది నాయకులు, యువకులు ఇవాళ తమ ఇంటికి వచ్చారని తెలిపారు. తమ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం సరికాదని, తమ ఎమ్మెల్యే గాంధీ ఇంటికి సమావేశం కోసం తాము వెళ్తే తప్పేంటని నిలదీశారు. గాంధీ రెండు జిల్లాల పరిధిలోకి వస్తారని, వస్తే రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయానికి రావాలని, లేదంటే మేడ్చల్ కార్యాలయానికి రావాలని ఆయన అన్నారు. అందరం కలిసి కేసీఆర్ వద్దకు వెళ్దామని చెప్పారు. అరికెపూడి గాంధీకి రాజకీయ నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలని శంబిపూర్ రాజు డిమాండ్ చేశారు. లేదంటే కేసీఆర్ ను కలిసి పార్టీలో కొనసాగాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ లో సామరస్యాన్ని కేసీఆర్ కాపాడారని తెలిపారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో విభేదాలు సృష్టిస్తున్నదని చెప్పారు. కాగా, శంభీపూర్ రాజు నివాసనికి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి, పోలీసులు డీసీఎంలో అక్కడినుంచి తరలించారు.
Admin
Studio18 News