Studio18 News - తెలంగాణ / : Gossip Garage : తెలంగాణ పాలిటిక్స్ మరోసారి రైతుల చుట్టూ తిరుగుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతు రుణమాఫీ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. తాజాగా సిద్ధిపేటకు చెందిన రైతు ఆత్మహత్య… రెండు పార్టీల మధ్య దుమారం రేపుతోంది. మాజీ మంత్రి హరీష్‌రావు, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం నడుస్తోంది. ఇంతకీ ఈ వ్యవహారంలో ఏం జరిగింది? రైతు ఆత్మహత్యకు కారణమంటున్న రుణమాఫీపై ఎవరి వాదన వాస్తవం? రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గింది.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ రైతు రుణమాఫీపై ఇప్పటికీ మాటల యుద్ధం కొనసాగుతోంది. గత నెల 15లోగా 2 లక్షల రూపాయలలోపు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేశామంటోంది కాంగ్రెస్. అయితే రాష్ట్రంలో అందరికీ రుణమాఫీ జరగలేదని వాదిస్తోంది ప్రతిపక్ష బీఆర్‌ఎస్. దీంతో ఎప్పటికప్పుడు రుణమాఫీ చుట్టూ రాజకీయ రచ్చ జరుగుతోంది. మొత్తం 26 లక్షల మంది రైతులకు 31 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం మొదట్లో ప్రకటించింది. కానీ ఆగస్టు 15 వరకు చేసిన రుణమాఫీలో 18 వేల కోట్ల రూపాయల నిధులను మాత్రమే విడుదల చేసింది. రైతు కుటుంబ నిర్ధారణ, తెల్ల రేషన్‌కార్డు లేకపోవడం, రెండు లక్షలకు పైగా ఉన్న రుణాలు కూడా మాఫీ చేయకపోవడంతో లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా అస్త్రాలు సంధిస్తోంది బీఆర్‌ఎస్. ఎంపీ అత్యుత్సాహంతో ఇరుకున పడిన కాంగ్రెస్ పార్టీ.. తాజాగా మేడ్చల్ జిల్లాలో రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న బీఆర్‌ఎస్ రైతు రుణమాఫీ అంశంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. దీంతో రైతు ఆత్మహత్య వివాదం రెండు పార్టీల మధ్య తారస్థాయికి చేరింది. రుణమాఫీ కానందునే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ మాజీ మంత్రి హరీష్‌రావు రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం, ఆయనకు కౌంటర్‌గా భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి రంగంలోకి దిగి అస్పష్ట సమాచారంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేయడం రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. నిజానికి రుణమాఫీ జరగలేదని సమాచారం.. చనిపోయిన రైతు సురేందర్ రెడ్డి తల్లికి లక్షా 50 వేల రూపాయల రుణమాఫీ జరిగిందని.. ఇంకా ఎవరైనా రుణమాఫీ జరగని రైతులు ఉంటే వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తుందని.. వారికి కూడా రుణమాఫీ చేస్తుందని చెప్పుకొచ్చిన ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి… తొందరపాటులో పూర్తి వివరాలు తెలుసుకోలేకపోయారంటున్నారు. వాస్తవానికి రైతు తల్లికి రుణమాఫీ జరగలేదని సమాచారం. రైతు సురేందర్‌రెడ్డి, ఆయన తల్లి ఒకే రేషన్‌కార్డులో ఉండటం.. ఇద్దరి రుణాలు కలిపి రెండు లక్షలపైగా ఉండటంతో రుణమాఫీ జరగలేదని చెబుతున్నారు. రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పై ఎదురుదాడి.. కానీ, హరీష్‌రావుకు కౌంటర్ ఇవ్వాలనే తొందరలో ఎంపీ చామల కిరణ్ ప్రదర్శించిన అత్యుత్సాహం కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టిందంటున్నారు. ఇదే అదునుగా చేసుకొని బి.ఆర్.ఎస్ మరింత దూకుడు పెంచింది. కాంగ్రెస్‌పై విమర్శలు సంధిస్తోంది. దీంతో నిజానిజాలను తెలుసుకున్న ఎంపీ చామల కిరణ్ నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టారు. చనిపోయిన రైతు సురేందర్‌రెడ్డి సోదరుడికి రుణమాఫీ జరిగింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. అంతేకాదు గతంలో బి.ఆర్.ఎస్ పదేళ్ల హయాంలో రైతు రుణమాఫీ విషయంలో జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మొదటి ఐదేళ్ల కాలంలో లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు విడతలుగా చేయడం.. దీని వల్ల రైతు బ్యాంకు వడ్డీకి కూడా సరిపోలేదంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఇక రెండో టర్మ్‌లో లక్ష రూపాయల రుణమాఫీ మాట ఇచ్చి చేయలేదనే అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. సో.. మొత్తం మీద ఇప్పుడు రైతు రుణమాఫీ అంశం తెలంగాణలో టాక్ ఆఫ్ ద స్టేట్‌గా మారింది. ఒకపక్క ప్రతిపక్షం రెండు లక్షల రుణమాఫీ చేయలేదని కౌంటర్ చేస్తుంటే.. అధికారపక్షం గతంలో రుణమాఫీ జరిగిన విధానాన్ని ప్రస్తావిస్తూ ప్రతిదాడి చేస్తోంది. ఇలా మొత్తం మీద అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది.
Admin
Studio18 News