Studio18 News - తెలంగాణ / : అరికెపూడి గాంధీకి దమ్ముంటే... మగాడైతే... చీమునెత్తురు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలకు రావాలని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి సవాల్ చేశారు. వీరి ఇరువురి మధ్య రెండు రోజులుగా సవాళ్లు, ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. ఉదయం కౌశిక్ రెడ్డిపై గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో, కౌశిక్ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో తన్నుకోవడం, గుద్దుకోవడం పెద్ద ఇష్యూ కాదని... నిజంగా తన్నుకుందామంటే గాంధీ ఒక్కడే రావాలన్నారు. తానూ ఒక్కడినే వస్తానని... తన్నుకొని ఎవరి బలం ఎంతో చూసుకుందామన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటిని అంగీకరించరన్నారు. అయితే అరికెపూడికి దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలన్నారు. అప్పుడే దమ్మున్నోడని ఒప్పుకుంటానన్నారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో సత్తా చూపించాలన్నారు. అప్పుడు కేసీఆర్ నాయకత్వంలో మా దమ్మెంతో చూపిస్తాం అని అన్నారు. పూటకో పార్టీ మారే బ్రోకర్ గాంధీ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీస్ కంచెలు వేసి తనను గాంధీ ఇంటికి వెళ్లకుండా ఆపేశారన్నారు. ఆయన ఉపయోగిస్తున్న భాషను ప్రజలు గమనిస్తున్నారన్నారు. నేను పక్కా తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డనని... ఎక్కడ్నుంచో వచ్చి మా గడ్డ మీద కూర్చొని సవాల్ విసిరితే భయపడే వ్యక్తిని కాదన్నారు. ఈరోజు కాకపోయినా రేపు ఉదయం వేలాదిమంది కార్యకర్తలతో కలిసి గాంధీ ఇంటికి వెళతామన్నారు. తెలంగాణ భవన్‌కు రావాలి అరికెపూడి గాంధీ బీఆర్ఎస్‌లోనే కొనసాగుతుంటే కనుక తెలంగాణ భవన్‌కు రావాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్‌తో తనకు పంచాయితీ లేదని ఆయన చాలా స్పష్టంగా చెప్పారని, అలాంటప్పుడు కార్యాలయానికి రావాలన్నారు. తనతో పంచాయితీ ఉందని అంటున్నారని, ఏమైనా భూమి పంచాయితీ ఉందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరుతారని ప్రశ్నించారు. కోట్లాది రూపాయలకు ఆయన అమ్ముడుపోయారని, భూ పంచాయితీలో సెటిల్మెంట్ల కోసమే అధికార పార్టీలో చేరారని ఆరోపించారు. అరికెపూడి గాంధీ తెలంగాణ భవన్‌కు వస్తే, ఇద్దరం కలిసి కేసీఆర్ వద్దకు వెళదామని... అలా రాకుంటే మాత్రం కాంగ్రెస్‌లో చేరినందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన మాత్రం బీఆర్ఎస్‌లోనే ఉన్నానని చెబుతున్నారని, అందుకే ఆయన ఇంటికి వెళుతున్నామన్నారు. ఆయనను సాదరంగా కేసీఆర్ ఇంటికి తీసుకువెళతామని వ్యాఖ్యానించారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన మా ఇంటికి వస్తే కనుక ఇద్దరం కలిసి భోజనం చేస్తామని, కలిసి మీడియా సమావేశం కూడా నిర్వహిస్తామని వ్యాఖ్యానించారు. తాను బీఆర్ఎస్‌లో చేరినప్పుడు తనతో పాటు పదిమందిని తీసుకెళ్లినట్లు గాంధీ చెబుతున్నారని, కానీ ఆరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఐదుగురు ఎమ్మెల్యేలే అని వెల్లడించారు.
Admin
Studio18 News