Studio18 News - తెలంగాణ / : Gossip Garage : కొత్త నీరు వస్తే… పాత నీరు పోతుందని అంటుంటారు. నిజమే.. పాత, కొత్త కలయిక అంత సులువేమీ కాదు. పాలిటిక్స్‌లో అస్సలు సాధ్యం కాదని నిరూపించే సంఘటనలు ఎన్నో మన కళ్ల ముందే జరుగుతున్నాయి. కొత్తవారు రావడం… పాతవారు పక్కకుపోవడం పాలిటిక్స్‌లో చాలా కామన్‌గా జరుగుతుంటుంది. కొత్తవారు తమను తొక్కేస్తున్నారని, తమ అవకాశాలను కొల్లగొట్టేస్తున్నారని పాత వారు గొడవ చేయడమే మిగులుతుంది. ఎందుకంటే కొత్త ఒక వింత.. పాత ఒక రోత… ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో పాత-కొత్త వర్గాల మధ్య ఫైట్ ఆసక్తికరంగా మారింది. తమకు అన్యాయం జరుగుతోందని సీనియర్ల ఆవేదన.. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఉన్నట్లే… చొప్పదండి నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య పోరు తీవ్రమవుతోంది. ఒరిజనల్ కాంగ్రెస్… జంపింగ్ కాంగ్రెస్ అన్నట్లు పార్టీలో రెండు గ్రూపులు నాయకులకు తలనొప్పులు తెస్తున్నాయి. ఐతే చొప్పదండి నియోజకవర్గంలో మాత్రం ఓ వర్గానికే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమకు అన్యాయం జరుగుతోందని బాధపడుతున్నారు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు. ఎన్నికల ముందు.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన మాజీ బీఆర్‌ఎస్ నేతల నుంచి పోటీ తట్టుకోలేక ఎమ్మెల్యేపై ఎర్రజెండా ఎగరేసేందుకు సిద్ధమవుతున్నారట సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు. జెండా మోసిన క్యాడర్‌ను పట్టించుకోవడం లేదనే విమర్శలు.. ముందు నుంచి కాంగ్రెస్ జెండా మోసిన క్యాడర్‌ను ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సత్యం తీరులో చాలా మార్పు వచ్చిందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బోయినపల్లి మండల నేతలతో దురుసుగా ప్రవర్తించారని తొలుత విమర్శలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే సత్యం ఆ తర్వాత మిడ్ మానేరు ముంపు గ్రామాల అధ్యక్షుడు కోస రవీందర్‌ను దూరం పెట్టడంపైనా నిరసనలు ఎదుర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే విధంగా కొడిమ్యాల, గంగాధర మండలాల్లోనూ ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ క్యాడర్ అసంతృప్తితో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. నామినేటెడ్ పోస్టులను తమకు కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు సీనియర్ కార్యకర్తలు. బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన నేతలతో వేగలేకపోతున్నామని గగ్గోలు.. బీఆర్‌ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌ను తప్పుదోవ పట్టించిన కొంతమంది నేతలు… ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యే సత్యంను మేనేజ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు పాత కాంగ్రెస్ నేతలు. కొడిమ్యాల మండలంలో బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన నేతలతో వేగలేకపోతున్నామని సీనియర్ నేతలు గగ్గోలు పెడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. రామడుగు, చొప్పదండి మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు కూడా తమ మాట వినడం లేదని కాంగ్రెస్ క్యాడర్ అసంతృప్తి చెందుతోంది. దీనంతటికీ ఎమ్మెల్యే సత్యం తమను నిర్లక్ష్యం చేయడమేనని వాపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. పాతవారెవరూ పార్టీలో మిగలరు..! నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోని ప్రస్తుతం ఆధిపత్యం చేలాయించడం కాంగ్రెస్ వర్గీయులకు మింగుడు పడడం లేదు. నియోజకవర్గంలో పదేళ్లుగా ఎమ్మెల్యే సత్యం వెంట నడిచిన వారు ఇప్పుడు దూరం జరుగుతున్నా, ఎమ్మెల్యే కనీసం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తుండడంతో… కాంగ్రెస్ పార్టీకి సెకండ్ క్యాడర్ దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేయడం వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతోందని.. ఇదే పరిస్థితి కొనసాగితే.. పాతవారెవరూ పార్టీలో మిగలరని అంటున్నారు. మరి ఈ సమస్యను ఎమ్మెల్యే ఎలా చక్కదిద్దుతారనేది ఆసక్తికరంగా మారింది.
Admin
Studio18 News